ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవన్ (7) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ పృథ్వీ షా (60) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (1), అక్షర్ పటేల్ (10) కూడా నిరాశపరచడంతో ఢిల్లీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందనిపించింది.
అయతే కెప్టెన్ రిషభ్ పంత్ (51), షిమ్రాన్ హెట్మెయర్ (37) ఇద్దరూ జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ జట్టు 172 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 2 వికెట్లు కూల్చగా, జడేజా, మొయీన్ అలీ, డ్వేన్ బ్రావో తలో వికెట్ పడగొట్టారు.