ముంబై: స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు భారీ షాక్. ఫామ్‌లో ఉన్న స్టార్ ఓపెనర్ ప్రతీక రావల్ వరల్డ్ కప్‌లో నాకౌట్ దశకు దూరమైంది. ఆమె స్థానాన్ని షఫాలీ వర్మ భర్తీ చేయనుంది. ప్రతీక అరంగేట్రం తర్వాత సుమారు ఏడాదికాలంగా వన్డే జట్టులో చోటు కోల్పోయిన షఫాలీ.. తాజాగా ఆమె స్థానాన్ని భర్తీ చేయనుండటం గమనార్హం.
గ్రూప్ దశలో ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ప్రతీక కుడి కాలికి గాయమైంది. మ్యాచ్ జరిగే సమయంలోనే ప్రతీకను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానాకు తరలించగా ప్రస్తుతం ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రతీక లేకపోవడం జట్టు లయను దెబ్బతీసేదే. ఈ టోర్నీలో ఇప్పటిదాకా ప్రతీక ఆరు ఇన్నింగ్స్‌ల్లో 51.33 సగటుతో 308 రన్స్ చేసింది. భారత జట్టు గురువారం ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.