ప్రస్తుతం భారత ప్రధాన పేసర్లలో మహమ్మద్ సిరాజ్ ఒకడు. బుమ్రా, షమీ లేకపోతే పేస్ భారాన్ని మోయాల్సింది సిరాజే అనడం అతిశయోక్తేమీ కాదు. కానీ అలాంటి సిరాజ్‌ను చాలా మంది.. ‘నీకు క్రికెట్ ఎందుకు? మీ నాన్నతో కలిసి ఆటోలు నడుపుకో’ అన్నారని తెలుసా? ఈ విషయాన్ని సిరాజ్ స్వయంగా వెల్లడించాడు. ఆర్సీబీ పోడ్‌క్యాస్ట్‌లో మాట్లాడిన సిరాజ్ తను ఎదుర్కొన్న విమర్శలను గుర్తుచేసుకున్నాడు.
2019లో ఆర్సీబీ తరఫున బౌలింగ్ చేసిన సిరాజ్.. అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఆ టోర్నీలో తొమ్మిది మ్యాచులు ఆడిన సిరాజ్ ఏడు వికెట్లు తీశాడు. ఎకానమీ 9.55 నమోదు చేశాడు. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2.2 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు బీమర్లు వేయడంతో ఇక మిగతా మ్యాచ్‌లో అతని చేత బౌలింగ్ చేయించలేదు.
ఆ సమయాన్ని గుర్తుచేసుకున్న సిరాజ్.. ‘2019లో ఆర్సీబీ తరఫున నా ప్రదర్శన చాలా చెత్తగా ఉంది. ఇక నా ఐపీఎల్ కెరీర్ ముగిసిందేమో అనుకున్నా. అయితే నా దగ్గర ఇంకా వయసుంది. అదే నమ్మకంతో ముందుకెళ్లా, నాకు ఆర్సీబీ యాజమాన్యం కూడా మద్దతిచ్చింది. ఆ తర్వాతి ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ నా జీవితాన్ని మార్చేసింది’ అని వివరించాడు. 2019లో రెండు బీమర్లు వేసిన తర్వాత చాలా మంది తనను తీవ్రంగా విమర్శించారని చెప్పాడు.
‘నీకు క్రికెట్ ఎందుకు? మానేసి మీ నాన్నతో కలిసి ఆటోలు వేసుకో’ అంటూ తిట్టారని గుర్తుచేసుకున్నాడు. అయితే తను తొలిసారి సెలెక్ట్ అయినప్పుడు ధోనీ చెప్పిన మాటలు తనకు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయన్నాడు. బాగా ఆడితే పొగిడే వాళ్లు, సరిగా ఆడకపోతే తిట్టిపోస్తారని, అలాంటి వాళ్ల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ధోనీ చెప్పాడట.
2019లో తనను తిట్టిన వాళ్లే ఇప్పుడు ‘నువ్వు బెస్ట్ బౌలర్‌వి భాయ్’ అంటూ మెచ్చుకుంటున్నారని సిరాజ్ పేర్కొన్నాడు. 2020 ఐపీఎల్లో సిరాజ్ సూపర్ ఫామ్‌లో కనిపించాడు. ఈ టోర్నీలో రెండు మెయిడెన్లు వేసిన అతను.. ఐపీఎల్ చరిత్రలో రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు రిటైన్ చేసుకున్న వాళ్లలో సిరాజ్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
Mohammed Siraj recounts the hardships he faced during his cricket journey, on the RCB Podcast powered by @KotakBankLtd.
Listen to the full episode on Spotify. Link: https://t.co/bixXHIUKAq#PlayBold #WeAreChallengers #RCBPodcast pic.twitter.com/BDDdgTfcwq
— Royal Challengers Bangalore (@RCBTweets) February 8, 2022