Paris Olympics 2024 | షూటింగ్..ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న క్రీడాంశం. చెక్కుచెదరని గురితో ప్రత్యర్థులకు దీటుగా సవాలు విసురుతూ ముందుకు సాగే షూటింగ్లో పతక వేట అంత సులువేం కాదు. రెప్పపాటు వ్యవధిలో ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఎక్కువ. శారీరక శ్రమకు తోడు మానసిక సంసిద్ధత కీలకమైన షూటింగ్లో ప్రతీ పాయింట్ పతక విజేతను నిర్ణయించేదే. గత(టోక్యో) ఒలింపిక్స్
చేదు అనుభవాలను చెరిపేస్తూ పారిస్‌లో పతకాలు కొల్లగొట్టాలని భారత షూటర్లు పట్టుదలతో ఉన్నారు. 21 మంది భారీ బలగంతో బరిలోకి దిగుతున్న భారత్.. చరిత్ర తిరుగురాయాలని చూస్తున్నది. విశ్వక్రీడల షూటింగ్లో మన పతక అవకాశాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం): ఒలింపిక్స్‌లో షూటింగ్‌కు ప్రత్యేక స్థానం. ప్రపంచ స్థాయి అత్యుత్తమ షూటర్లతో పోటీపడుతూ పతకం సాధించడం మామూలు విషయం కాదు. ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచకప్ లాంటి మెగాటోర్నీల్లో పతకాలు సాధించినా..ఒలింపిక్స్‌లో ఉండే ఆ పోటీనే వేరు. అంచనాలు లేకుండా బరిలోకి దిగుతూ పతకాలు ఖాతాలో వేసుకునే వారే ఎక్కువ. అయితే ఇది భారత్ విషయంలో పూర్తి విరుద్ధంగా సాగుతున్నది.
భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి రిక్తహస్తాలతో వెనుదిరిగిన వారే మనకు ఎక్కువ. సరిగ్గా మూడేండ్ల క్రితం టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో 18 మందితో భారత షూటింగ్ బృందం కనీసం ఒక్క పతకం సాధించకుండానే స్వదేశానికి భారంగా చేరుకుంది. ఇందులో అందరూ మంచి పేరున్న షూటర్లే. కానీ లోపం ఎక్కడ జరిగిందో తెలుసుకునే లోపే జరుగాల్సిన నష్టం కాస్తా జరిగిపోయింది. కానీ టోక్యోలో జరిగిన తప్పునే తిరిగి చేసే ఉద్దేశం లేని జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
అప్పటి వరకు తమ స్థానాలకు ఢోకా లేదనుకున్న కోచ్‌లను పక్కకు తప్పించింది. దీనికి తోడు భారీ అంచనాల మధ్య పోటీకి దిగి ఒత్తిడికి చిత్తయిన షూటర్లను వాస్తవ రూపం ఏంటో తెలిసి వచ్చేలా చేశారు. సౌరభ్ చౌదరీ, అభిషేక్‌వర్మ, అపూర్వి చండేలా, రహీ సర్నోబత్ లాంటి వారు ఈ కోవలోకే వస్తారు. వీరిని ఒక రకంగా పక్కకు తప్పిస్తూ సిఫ్ట్‌కౌర్ సమ్రా, సరబ్జ్యోత్సింగ్ లాంటి మెరికల్లాంటి షూటర్లకు అండగా నిలువడంతో మెరుగైన ఫలితాలు వచ్చాయి.
ఇక మీడియా హైప్‌తో ఎక్కడికో వెళ్లిపోయిన స్టార్ మను భాకర్ తిరిగి స్వల్ప కాలంలోనే యథా స్థానానికి వచ్చింది. ఇలా ప్రతీ అంశంలోనే జాగ్రత్తలు తీసుకుంటూ షూటర్లను ఎంపిక చేశారు. ఈ క్రమంలో ప్రతిభ, ప్రదర్శనను ఆధారంగా చేసుకుంటూ పైరేవీలకు ఆస్కారం లేకుండా ఈసారి ఒలింపిక్స్‌కు షూటర్లను ఎంచుకున్నారు. దీనికి తోడు విశ్వక్రీడల సన్నద్ధత కోసం కేంద్ర క్రీడాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో ముఖ్యంగా చైనా, రష్యా షూటర్ల నుంచే భారత్‌కు కఠిన పోటీ ఎదురయ్యే అవకాశముంది. చైనాకు చెందిన షెంగ్ లివో, డు లిన్షు, జాంగ్ బోవెన్, జింగ్ రాక్సిన్ లాంటి షూటర్లు భారత్‌కు ప్రతిబంధకంగా నిలువనున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధంతో వేటు ఎదుర్కొంటున్న రష్యా షూటర్ల నుంచి భారత్‌కు తీవ్ర పోటీ పొంచి ఉంది.
