పెర్త్: వరుస పరాజయాల అనంతరం పాకిస్థాన్ తిరిగి గెలుపు రుచి చూసింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రూప్-2లో భాగంగా మూడు మ్యాచ్‌లాడిన పాక్‌కు ఇదే తొలి గెలుపు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కొలిన్ అకెర్మన్ (27) టాప్ స్కోరర్ కాగా.. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 3, మహమ్మద్ వసీమ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పాకిస్థాన్ 13.5 ఓవర్లలో 4 వికెట్లకు 95 రన్స్ చేసింది. రిజ్వాన్ (49) రాణించాడు. షాదాబ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
పాక్ పేసర్లను ఎదుర్కొనేందుకు నెదర్లాండ్స్ ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడ్డారు. రవుఫ్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఐదో బంతికి నెదర్లాండ్స్ ప్లేయర్ లీడ్ గాయపడ్డాడు. 142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన షార్ట్ పిచ్ బంతి హెల్మెట్ గ్రిల్లో నుంచి లీడ్‌ను బలంగా తాకింది. దీంతో కంటి కింది భాగంలో గాయమైంది. రక్తం ధారగా కారుతుండటంతో లీడ్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.