ఢిల్లీ: భారత్ ఆతిథ్యమివ్వనున్న జూనియర్ హాకీ ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగింది. ఈ మేరకు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 మధ్య చెన్నై, మధురై వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉండగా నెల రోజుల ముందు పాకిస్థాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) తమ నిర్ణయాన్ని ఎఫ్‌ఐహెచ్‌కు తెలిపింది.
భారత్, చిలీ, స్విట్జర్లాండ్‌తో పాటు గ్రూప్-బీలో ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన పాక్.. టోర్నీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసే జట్టుపై ఎఫ్ఐహెచ్ దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో తటస్థ వేదికను ఏర్పాటుచేయాలని పీహెచ్ఎఫ్ కోరినా అందుకు ఎఫ్ఐహెచ్ అంగీకరించలేదని తెలుస్తున్నది. దీంతో పాక్ టోర్నీ నుంచి వైదొలిగింది. కాగా ఈ ఏడాది ఆగస్టులో భారత్‌లోనే జరిగిన పురుషుల ఆసియా కప్ నుంచీ పాకిస్థాన్ తప్పుకున్న విషయం విదితమే.