Pakistan vs Netherlands : టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నెదర్లాండ్స్-పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచులో పాక్ విజయం సాధించింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని అతికష్టమ్మీద చేధించింది పాక్. ఈ రెండు జట్లకు ఇది టోర్నీలో తొలి మ్యాచ్. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో స్కాట్ ఎడ్వర్డ్స్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, బాస్ డీ లీడే 30 పరుగులు, మేఖేల్ లెవిట్ 24 పరుగులు, కోలిన్ అకెర్మాన్ 20 పరుగులు సాధించారు.
మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు తలో వికెట్ తీశారు. అనంతరం 148 పరుగుల స్వల్ప టార్గెట్‌తో లక్ష్య చేధనకు దిగిన పాక్ ఒక దశలో ఓటమి ఖాయం అనిపించే స్తితికి చేరుకుంది. కానీ, 19వ ఓవర్ పాక్‌ను విజయానికి చేర్చింది. నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ 24 పరుగులిచ్చాడు. లేకుంటే ఈ మ్యాచులో పాక్ ఓటమి చవిచూసేదే. ఒక రకంగా చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్.. పాక్‌కు ముచ్చెమటలు పట్టించింది. పాక్ ఓపెనర్ ఫర్హాన్ 47 పరుగులు (31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలవగా, మరో ఓపెనర్ ఆయుబ్ 24 (13 బంతులు) పరుగులు చేసి పాక్ స్కోరును ముందుకు నడిపించాడు. అయితే, వీరి తర్వాత వచ్చిన కెప్టెన్ సల్మాన్ ఆఘా 12 పరుగులు మాత్రమే చేయగా, బాబర్ ఆజం 15 పరుగులే చేశాడు.
మరో స్టార్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా డకౌట్ అయ్యాడు. చివర్లో ఫాహిమ్ అష్రఫ్ 11 బంతుల్లో 29 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల పాక్ అతికష్టమ్మీద గెలిచింది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులతో లక్ష్యాన్ని చేధించింది. ఇక నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యత్ దత్ రెండు వికెట్లు తీయగా, పాల్ వాన్ మరో రెండు వికెట్లు తీశాడు. లోగాన్, కైలీ, వాన్ డెర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో పాక్ గెలిచినప్పటికీ.. పసికూన నెదర్లాండ్స్ పోరాట పటిమ ఆకట్టుకుంది.