Pak Vs Ban Test | రావల్పిండి: పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. వర్షం అంతరాయం కారణంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు ఆలస్యంగా మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి పాక్ 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా..పాక్‌కు ఆదిలోనే ముచ్చెమటలు పట్టించింది. పచ్చని పిచ్‌పై బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 16 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(2), కెప్టెన్ షాన్ మసూద్(6), బాబర్ ఆజమ్(0) వెంటవెంటనే ఔటయ్యారు.
ఈ తరుణంలో సయిమ్ ఆయూబ్(56), సౌద్ షకీల్(57నాటౌట్) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి బంగ్లా బౌలర్లను సమర్థంగా నిలువరిస్తూ నాలుగో వికెట్‌కు 98 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షకీల్‌తో పాటు రిజ్వాన్(24) క్రీజులో ఉన్నాడు. షరీఫుల్ ఇస్లాం(2/30), హసన్(2/33) రెండేసి వికెట్లు తీశారు.