న్యూఢిల్లీ: పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్(Arshad Nadeem).. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఇండియాలో బ్లాక్ చేశారు. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లను ఇండియా బ్యాన్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ స్టార్ అర్షద్ నదీమ్ ఇన్‌స్టా అకౌంట్‌ను నిలిపివేశారు. గత ఏడాది జరిగిన ఒలింపిక్స్‌లో అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు. నదీమ్ ప్రొఫైల్‌ను విజిట్ చేయాలనుకుంటున్న వారికి.. అకౌంట్ నాట్ అవైలెబుల్ ఇన్ ఇండియా అని వస్తున్నది.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు షోయెబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిదీకి చెందిన యూట్యూబ్ అకౌంట్లను కూడా ఇండియాలో బ్లాక్ చేశారు. ఆ ఛానళ్లకు చెందిన కాంటెంట్ అందుబాటులో లేదు. కానీ ఆ క్రికెటర్ల ఇన్‌స్టా ప్రొఫైల్ మాత్రం యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పాక్ క్రికెటర్లు బాబర్ ఆజమ్, రిజ్వాన్ ఇన్‌స్టా అకౌంట్లు ఇంకా ఇండియాలో కనిపిస్తున్నాయి. నటులు మహిరా ఖాన్, అలీ జాఫర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేశారు.
పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రాకు గట్టి పోటీ ఇచ్చారు అర్సద్ నదీమ్. ఆ ఈవెంట్లో నదీమ్‌కు గోల్డ్ మెడల్ దక్కింది. అయితే బెంగుళూరులో మే 24వ తేదీన జరగనున్న ఎన్సీ క్లాసిక్ జావెలిన్ ఈవెంట్లో పాల్గొనేందుకు నదీమ్ రావడం లేదు. వాస్తవానికి తొలుత ఇన్విటేషన్ వెళ్లినా.. పెహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ జావెలిన్ త్రోయర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.