చెన్నై: వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్(Pakistan)తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ మ్యాచ్‌లో కొన్ని నిర్ణయాలు పాక్‌ను కృంగదీశాయి. టార్గెట్ ఛేజింగ్ సమయంలో సౌతాఫ్రికా బ్యాటర్ షంసీ అంపైర్ నిర్ణయం వల్ల ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో తీసుకున్న డీఆర్ఎస్ పాకిస్థాన్‌కు కలిసిరాలేదు. దీంతో పాక్ క్రికెటర్లు మైదానంలో తీవ్ర స్థాయిలో నిర్ఘాంతపోయారు.
271 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఓ దశలో గెలుపు తీరం వైపు ఈజీగా వెళ్లినా.. మధ్యలో ఆ జట్టుకు జలక్‌లు తగిలాయి. అయితే లక్ష్యానికి మరో 11 పరుగుల దూరంలో చివరి జంట కేశవ్ మహారాజ్, తబ్రెయిజ్ షంసీ మాత్రమే క్రీజ్‌లో ఉన్నారు. ఒకవేళ ఆ ఒక్క వికెట్ తీసినా పాక్ ఈజీగా మ్యాచ్‌ను గెలిచేది. కానీ ఆ ఇద్దరూ సౌతాఫ్రికాను విజయతీరాలకు చేర్చారు.
అయితే 46వ ఓవర్లో ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ణయం పాక్‌కు చేదును పంచింది. హరీశ్ రౌఫ్ బౌలింగ్‌లో షంస్సీ వికెట్ల ముందు దొరికాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో పాక్ డీఆర్ఎస్కు వెళ్లింది. రౌఫ్ బౌలింగ్‌లో షంసీ ఫ్రంట్ ప్యాడ్ బంతి తగిలింది. అయితే బాల్ ట్రాకింగ్‌లో బంతి లెగ్ స్టంప్‌ను తాకుతున్నట్లు కనిపించినా.. ఆ నిర్ణయం అంపైర్స్ కాల్‌గా ఇచ్చారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడం వల్ల.. షంసీ బ్రతికిపోయాడు. కానీ పాక్ క్రికెటర్లు విలవిలలాడారు. డీఆర్ఎస్ కలిసిరాలేదని వేదనకు గురయ్యారు.