లండన్: సుమారు నెల రోజులుగా యూకే వేదికగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ‘ది హండ్రెడ్’ నాలుగో ఎడిషన్ విజేతగా ‘ఓవల్ ఇన్విన్సిబుల్స్’ నిలిచింది. 2024 ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సామ్ బిల్లింగ్ సారథ్యంలోని ఓవల్.. టైటిల్‌ను నిలబెట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్.. వంద బంతుల్లో 9 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఓపెనర్ విల్‌జాక్స్ (37), సామ్ కరన్ (25), జోర్డాన్ కాక్స్ (25) రాణించారు. మోస్తరు లక్ష్య ఛేదనలో సౌథర్న్ బ్రేవ్ తడబడింది. ఆ జట్టు వంద బంతుల్లో 130-7 వద్దే ఆగిపోయి 17 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఓపెనర్లు అలెక్స్ డేవిస్ (35), జేమ్స్ విన్స్ (24) తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించినా ఓవల్ స్పిన్నర్లు ఆడమ్ జంపా (2/26), సకిబ్ మహ్మద్ (3/17) కట్టడి చేయడంతో ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఓవల్‌కు ఇది వరుసగా రెండో హండ్రెడ్ టైటిల్. కాగా మహిళల ‘హండ్రెడ్’ ట్రోఫీని లండన్ స్పిరిట్స్ సొంతం చేసుకుంది.