కబడ్డీ ఆట అంటే అతనికి ప్రాణం. ఊహ తెలియని వయసులోనే తన కంటే పెద్ద వాళ్లతో కలిసి ఆడిన నేపథ్యం. కబడ్డీ..కబడ్డీ అంటూ ఊరు పొలిమేరల్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన వైనం. తొమ్మిదో తరగతిలోనే రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రతిభ అతని సొంతం. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) జట్టులో కీలక ఆటగానిగా స్వర్ణ పతకంతో మెరిసిన సందర్భం. అతను మరెవరో కాదు గద్వాల కుర్రాడు గాల్ల రాజురెడ్డి. రానున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో తెలుగు టైటాన్స్ తరఫున సత్తాచాటేందుకు సై అంటున్నాడు. పీకేఎల్‌లో ఏకైక తెలంగాణ ప్లేయర్‌గా బరిలోకి దిగుతున్న రాజుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
దేశంలోనే ప్రతిష్ఠాత్మక కబడ్డీ లీగ్‌గా పేరొందిన పీకేఎల్‌లో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. గత కొన్నేండ్లుగా తెలంగాణ తరఫున జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాను. జూనియర్ స్థాయిలోనూ మెరుగైన రికార్డు ఉండటం కలిసొచ్చింది. ముఖ్యంగా గతేడాది పసిడి పతకం గెలిచిన సాయ్ జూనియర్ జట్టులో నేను కీలక ఆటగాన్ని. పీకేఎల్ వేలం పాటలో తెలుగు టైటాన్స్ జట్టు నన్ను ఎంపిక చేసుకుందన్న విషయం తెలిసి సంతోషపడ్డాను. లీగ్ మొత్తమ్మీద 12 జట్లలో తెలంగాణ నుంచి నేను ఏకైక ప్లేయర్ కావడం గర్వంగా ఉంది. వచ్చే నెల 22 నుంచి బెంగళూరు వేదికగా మొదలవుతున్న ఎనిమిదో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సత్తాచాటాలనుకుంటున్నాను.
దాదాపు నెల రోజుల వ్యవధిలో మొదలుకాబోతున్న లీగ్ కోసం ప్రస్తుతం హైదరాబాద్‌లో సహచర ఆటగాళ్లతో కలిసి సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కోచ్ జగదీశ్ కుంబ్లే శిక్షణలో మెళకువలు నేర్చుకుంటున్నాను. సిద్దార్థ్ దేశాయ్, రోహిత్ కుమార్ లాంటి సీనియర్లతో వామప్ మ్యాచ్‌లు ఆడటం ద్వారా ఆటపై పట్టు సాధిస్తున్నాను. రైడర్‌గా జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదిగేందుకు వచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకోవాలన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.
రానున్న పీకేఎల్‌లో రాణించడం నా ముందున్న లక్ష్యం. అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగడమే నా నైజం. తుది జట్టులో ఆడే చాన్స్ లభిస్తే కచ్చితంగా సత్తాచాటుతానన్న గట్టి నమ్మకం నాకుంది. రైడింగ్‌లో దూకుడు కనబరిచే నేను..ప్రత్యర్థి ప్లేయర్లను దీటుగా ఎదుర్కొగల ధీమాతో ఉన్నాను. ముఖ్యంగా కోచ్ కుంబ్లే..సీనియర్ ప్లేయర్ల సలహాలు, సూచనలతో జట్టులో కీలక ప్లేయర్‌గా ఎదగాలనుకుంటున్నాను. పీకేఎల్‌లో రాణించడం ద్వారా సమీప భవిష్యత్‌లో భారత్‌కు ఆడాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అందుకు తగ్గట్టు ప్రణాళికతో వెళుతున్నాను. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నుంచి నాకు పూర్తి మద్దతు ఉంది. నాకు అన్ని విషయాల్లో వాళ్లు అండగా నిలుస్తున్నారు. జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలనుకుంటున్నాను. మిగతా రాష్ర్టాలతో పోల్చుకుంటే పీకేఎల్‌లో మన ప్రాతినిధ్యం తక్కువ ఉంది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహిస్తే ఇక్కడి నుంచి మరింత యువకులు వెలుగులోకి వస్తారని ఈ 21 ఏండ్ల యువ రైడర్ రాజు చెప్పుకొచ్చాడు.
పల్లెటూర్లకు కబడ్డీ ఆటకు అవినాభావ సంబంధం ఉన్నది. చిన్నతనంలోనే ఆటపై మక్కువ పెంచుకున్నాను. వయసులో నా కంటే పెద్దవారితో కలిసి ఆడటం అనుభవ పరంగా కలిసొచ్చింది. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడే రాష్ట్ర జట్టుకు ఆడే అవకాశం లభించింది. అక్కణ్నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. టోర్నీ టోర్నీకి మెరుగవుతూ సాయ్ జూనియర్ జట్టుకు ఎంపికయ్యాను. ఇక్కడే నా కెరీర్ కీలక మలుపు తిరిగింది. అనుభవం కల్గిన కోచ్‌ల శిక్షణలో రాటుదేలాను. గతేడాది జరిగిన జాతీయ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాయ్ జట్టు స్వర్ణ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించాను. ఈ ఏడాది అయోధ్యలో జరిగిన నేషనల్ సీనియర్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. దీనికి తోడు తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్(టీపీకేఎల్)లో మూడో సీజన్లో ‘విలువైన ఆటగాని’గా అవార్డు దక్కించుకోవడం నాకు కలిసొచ్చింది. అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించేందుకు టీపీకేఎల్ మంచి వేదికగా ఉపయోగపడింది.
మాది జోగులాంబ గద్వాల జిల్లా భీమ్‌పురం గ్రామం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. మేమిద్దరం సోదరులం..నేను పెద్దవాడిని. ప్రస్తుతం డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. ఆటతో పాటు చదువులోనూ ఆకట్టుకుంటున్నాను.