Ollie Pope : ఉప్పల్ టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఓలీ పోప్(Ollie Pope) చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఓటమి అంచున ఉన్న జట్టుకు పోప్ ఒంటిచేత్తో కొండంత స్కోర్ అందించాడు. తొలి టెస్టులో స్టోక్స్ సేనకు అద్భుత విజయాన్ని కట్టబెట్టిన ఈ స్టార్ బ్యాటర్ రెండో టెస్టుకు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పిచ్‌లపై డిఫెన్స్ ఆడడం కంటే స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడడం చాలా సురక్షితమని అన్నాడు.
‘బ్యాటర్లకు చాలా కష్టమైన బంతులు ఎదురవుతాయి. అందుకని ఎక్కువగా స్వీప్, రివర్స్ స్వీప్ ఆడితే బౌలర్లు ఒత్తిడిలో పడతారు. ఎందుకంటే మంచి బంతుల్ని ప్రతిసారి రివర్స్ స్వీప్ ద్వారా ఫోర్ కొట్టలేం కదా. పైగా మేము ఎదుర్కొనేది నాణ్యమైన స్పిన్నర్లను. అందుచేతనే నేను స్వీప్ షాట్లను అస్త్రంగా ప్రయోగించా’ అని పోప్ వెల్లడించాడు.
ఓలీ పోప్
భారత జట్టుతో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరిన పోప్.. రెండో ఇన్నింగ్స్‌లో గోడలా నిలబడి సెంచరీ బాదాడు. జో రూట్, స్టోక్స్, బెయిర్‌స్టో వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు విఫలైమన చోట బజ్‌బాల్ ఆటతో భారత బౌలర్లను ఉతికారేశాడు. బుమ్రా బెంబేలెత్తించినా పట్టుదలగా క్రీజులో నిలబడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు.
పదే పదే రివర్స్ స్వీప్ షాట్లతో అశ్విన్, జడేజా లయను దెబ్బతీసిన పోప్.. 21 ఫోర్లతో 196 పరుగుల చేసి ఇంగ్లండ్‌కు భారీ స్కోర్ అందించాడు. అనంతరం 231 పరుగుల ఛేదనలో టీమిండియా 202కే కుప్పకూలింది. యువ స్పిన్నర్ టామ్ హర్ట్లే 7 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో బోణీ కొట్టింది. రెండో టెస్టు ఫిబ్రవరి 2న విశాఖపట్టణంలో జరుగనుంది.