AFG vs IRE | అఫ్గానిస్తాన్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం ముగిసిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఆ జట్టుకు ఆరేండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆడుతున్న 8వ టెస్టులో తొలి విజయం దక్కింది. మరి మూడు ఫార్మాట్లలో అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న భారత జట్టు టెస్టులలో తొలి విజయానికి ఎన్ని టెస్టులు వేచి చూడాల్సి వచ్చిందో తెలుసా..? భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ వంటి జట్లు ఎన్నో మ్యాచ్‌కు తొలి విజయానుభూతిని పొందాయో తెలుసా..?
నెంబర్ వన్ ఆస్ట్రేలియా..
1877 నుంచి అంతర్జాతీయ స్థాయిలో టెస్టులకు అధికారిక హోదా దక్కగా ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఇప్పటివరకూ ఆస్ట్రేలియా మాత్రమే. 1877లో ఇంగ్లండ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లీష్ జట్టు.. రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీంతో ఇంగ్లండ్‌కు ఆడిన రెండో టెస్టులో విజయం దక్కింది. ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లు కూడా ఆడిన రెండో టెస్టులోనే విజయం సాధించాయి. ఈ జాబితాలో వెస్టిండీస్ ఐదో స్థానంలో ఉంది. విండీస్.. ఆరో టెస్టులో తొలి గెలుపు రుచి చూసింది. విండీస్ తర్వాత ఐర్లాండ్ (8 టెస్టులలో), జింబాబ్వే (11 టెస్టులు), సౌతాఫ్రికా (12 టెస్టులు), శ్రీలంక (14 టెస్టులు) ఉన్నాయి.
భారత్ 25వ టెస్టులో..
1932 నుంచి భారత జట్టు టెస్టు క్రికెట్ ఆడుతోంది. కానీ టీమిండియాకు తొలి విజయం అందుకోవడానికి 20 ఏండ్లు పట్టింది. భారత్ ఆడిన 25వ టెస్టులో మనకు మొట్టమొదటి విజయం దక్కింది. 1951-52లో చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన టెస్టులో భారత్.. తొలి విజయాన్ని రుచి చూసింది.
Six years after their Test debut, Ireland have their first win 🏆 #AFGvIRE pic.twitter.com/BjbAYirPFf
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024
న్యూజిలాండ్ 45వ టెస్టుకు..
అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా ఆడే జట్లలో న్యూజిలాండ్ ఒకటి. 1930 నుంచి టెస్టులు ఆడటం మొదలుపెట్టిన కివీస్.. 45వ టెస్టులో తొలి విజయం సాధించింది. 1955-56లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో కివీస్ గెలిచింది. కివీస్ కంటే ముందు ఈ జాబితాలో బంగ్లాదేశ్ ఉంది. ఆ జట్టు మొదటి గెలుపు అందుకోవడానికి 35 టెస్టులు అవసరమయ్యాయి.