న్యూయార్క్: ఒకే ఒక్క మ్యాచ్.. ఆ మ్యాచ్ గెలిచి ఉంటే టెన్నిస్‌లో మరో చరిత్ర సృష్టించేవాడు సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జోకొవిచ్. 1969 తర్వాత కేలండర్ స్లామ్ సాధించిన తొలి ప్లేయర్‌గా నిలవడానికి, అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించడానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో మెద్వెదెవ్ చేతుల్లో వరుస సెట్లలో ఓడిన జోకొవిచ్.. ఆ ఓటమిని తట్టుకోలేక నానా హంగామా చేశాడు.
కోర్టులో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ జోకర్‌గా పేరుగాంచిన అతడు.. తన ఆగ్రహాన్ని కూడా దాచుకోడు. ఓటమి బాధలో అతడు తన రాకెట్ విరగ్గొట్టాడు. తృటిలో చరిత్ర సృష్టించే అవకాశాలన్ని చేజార్చుకోవడంతో కంటతడి పెట్టాడు. అయితే ఇప్పుడు కాస్త ఉపశమనంగా ఉంది.. అది జరిగిపోయినందుకు సంతోషంగా ఉంది అని మ్యాచ్ తర్వాత జోకొవిచ్ అన్నాడు. ఈ సమయంలో న్యూయార్క్ అభిమానులు అతనికి అండగా నిలిచారు.
టోర్నీ మొత్తం తాను చాలా ఒత్తిడి అనుభవించానని ఈ సందర్భంగా జోకర్ చెప్పాడు. మొత్తానికి ఈ ఒత్తిడి నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా.. అదే సమయంలో అనుకున్నది సాధించనందుకు బాధగా కూడా ఉన్నదని అన్నాడు. ప్రస్తుతం ఫెదరర్, నడాల్‌తో కలిసి జోకొవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో సంయుక్తంగా టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ యూఎస్ ఓపెన్ గెలిచి ఉంటే.. ఆ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్‌ను అధిగమించేవాడు.