మట్టికోట మహారాజు రఫేల్ నాదల్ గైర్హాజరీలో.. మూడో సీడ్ జొకోవిచ్ జోరు కనబరుస్తున్నాడు. తొలి రెండు రౌండ్లను అలవోకగా గెలచుకున్న జొకో.. మూడో రౌండ్లోనూ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. యువ ఆటగాడు ఆఫ్నర్తో పాటు కచనోవ్, సోంగో కూడా ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక, స్టిఫేన్స్, స్వితోలినా ముందంజ వేయగా.. మూడో సీడ్ పెగులాకు మూడో రౌండ్లో చుక్కెదురైంది.
పారిస్: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. టోర్నీ ఆరంభం నుంచి జోరు మీదున్న సెర్బియా వీరుడు శుక్రవారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో 7-6 (7/4), 7-6 (7/5), 6-2తో డవిడోవిచ్ ఫొకినా (స్పెయిన్)పై విజయం సాధించాడు. మూడున్నర గంటలపాటు సాగిన పోరులో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని మూడో సీడ్ జొకో.. తిరుగులేని ఆధిపత్యం కనబర్చాడు. జొకో 38 అనవసర తప్పిదాలకు పాల్పడగా.. ప్రత్యర్థి 51 తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గి జోరు మీదున్న జొకోవిచ్.. అదే ఊపులో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాలని తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం జొకో 22 టైటిల్స్‌తో నాదల్ (22)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.
తొలి రెండు ఓడాక..
ఇతర మ్యాచ్‌లలో సోంగో 5-7, 0-6, 6-3, 7-6 (7/5), 6-3తో రూబ్లేవ్పై గెలుపొందాడు. తొలి రెండు సెట్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సోంగా.. ఆ తర్వాత వరుసగా మూడు సెట్లు నెగ్గడం విశేషం. మరో మ్యాచ్‌లో ఆఫ్నర్ 5-7, 6-3, 7-5, 1-6, 6-4తో ఫాగినిపై గెలుపొందగా.. కచనోవ్ 6-4, 6-1, 3-6, 7-6 (7/5)తో కొకినాకిస్‌పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు.
సబలెంక ముందంజ
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంక ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో సబలెంక 6-2, 6-2తో రఖిమోవాను వరుస సెట్లలో చిత్తుచేసింది. మరోవైపు స్టిఫోన్స్ కూడా జోరు కొనసాగించింది. 6-3, 3-6, 6-2తో పుతిన్సెవాపై నెగ్గి ముందంజ వేసింది. స్వితోలినా 2-6, 6-2, 7-5తో బ్లింకోవాను మట్టికరిపించగా.. కసాత్కినా 6-0, 6-1తో స్టెర్న్స్పై ఏకపక్ష విజయం సాధించింది. అమెరికా స్టార్ ప్లేయర్ పెగులాకు మూడో రౌండ్లో పరాజయం ఎదురైంది. 1-6, 3-6తో మెర్టెన్స్ చేతిలో ఓడి ఇంటి బాట పట్టింది.
సాకేత్ జంట ఓటమి
పురుషుల డబుల్స్‌లో భారత జోడీ సాకేత్ మైనేని-యూకీ బాంబ్రీ ఓటమి పాలైంది. తొలి రౌండ్లో చక్కటి విజయం సాధించిన భారత ద్వయం.. శుక్రవారం రెండో రౌండ్లో 4-6, 5-7తో గోంజలేజ్-రోజర్ వాస్లెన్ జంట చేతిలో ఓడింది.