హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరిగిన ఈఎమ్ఈ సెయిలింగ్ రెగెట్టా చాంపియన్‌షిప్‌లో నార్తర్న్ కమాండ్ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారంతో ముగిసిన టోర్నీలో నార్తర్న్ కమాండ్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, సౌత్ వెస్ట్రన్ కమాండ్(8), సదరన్ కమాండ్(11) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఐఎల్సీఏ7 విభాగంలో గోవింద్ బైరాగి స్వర్ణ పతకంతో మెరువగా, విష్ణు, యమన్దీప్ రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఐఎల్సీఏ 6 కేటగిరీలో కిరణ్‌కు పసిడి దక్కగా, ధర్మేందర్‌కు రజతం, గౌతమ్‌కు కాంస్యం లభించాయి. విజేతలకు మేజర్ జనరల్, డిప్యూటీ కమాండెంట్ అజయ్ శర్మ ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘టోర్నీలో పాల్గొన్న సెయిలర్లందరికీ శుభాకాంక్షలు. దేశంలోని వివిధ ఆర్మీ యూనిట్ల నుంచి ఈ రెగెట్టా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇది కేవలం అనుభవం కల్గిన సెయిలర్లకే కాదు.. కొత్త వాళ్లు తమ నైపుణ్యాన్ని పెంచుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది. రానున్న హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో రాణించడం ద్వారా ఆర్మీ, భారత జట్టులో చోటు దక్కించుకునేందుకు మంచి అవకాశముంది’ అని అన్నారు.