పారిస్: కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరించిన టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్.. ఆస్ట్రేలియా నుంచి అనూహ్య రీతిలో వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జోకోకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అతని వీసాను రద్దు చేయడంతో.. ఆ దేశం విడిచి దుబాయ్ ఫ్లయిట్ ఎక్కాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అవసరం. ఇక మే నెలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ కూడా ఆడే ఛాన్సు జోకోవిచ్ పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్ నుంచి ఎవరికీ మినహాయింపు లేదని, వ్యాక్సిన్ పాస్ తప్పనిసరి అని తాజాగా ఫ్రాన్స్ క్రీడా మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆదివారం రోజున వ్యాక్సిన్ పాస్ చట్టాన్ని ఫ్రాన్స్ ఆమోదించింది. రెస్టారెంట్లు, కేఫ్‌లు, సినిమాలు, రైళ్లలో వెళ్లాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ చట్టం రూపొందించారు. ఈ రూల్ ఎవరికైనా వర్తిస్తుందని, అది ప్రేక్షకుడైనా లేక క్రీడాకారుడైనా.. వ్యాక్సిన్ పాస్ ఉండాల్సిందే అని ఫ్రాన్స్ మంత్రి తెలిపారు. తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మిస్ అయిన జోకోకు.. మే లో జరిగే ఫ్రెంచ్ ఓపెన్ వరకు చాలా టైమ్ ఉంది. ఒకవేళ ఈలోపు జోకో వ్యాక్సిన్ తీసుకున్నా.. లేకుంటే ఫ్రాన్స్ రూల్స్ మార్చినా అతనికి అక్కడే ఆడే అవకాశం ఉంటుంది.