ఢిల్లీ : భారత ఫుట్‌బాల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్! సుమారు దశాబ్దకాలంగా ఫ్యాన్స్‌ను అలరిస్తున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. ప్రతియేటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య జరిగే ఈ లీగ్‌ను 2025-26 సీజన్లో నిర్వహించేది కష్టమేనని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చెప్పకనే చెప్పింది. ఐఎస్ఎల్ తర్వాత నిర్వహించే సూపర్కప్ను ముందుగానే నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈ మేరకు ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే మాట్లాడుతూ.. ‘ఐఎస్ఎల్ క్లబ్‌ల సూచనల దృష్ట్యా సూపర్ కప్‌ను ముందే నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నాం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని తెలిపారు. లీగ్ ఆర్గనైజర్లకు, సమాఖ్యకు మధ్య మాస్టర్ రైట్స్ అగ్రిమెంట్ (ఎంఆర్ఏ) విషయంలో నెలకొన్న అనిశ్చితి కారణంగానే ఐఎస్ఎల్ భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయని సమాచారం.