UTT League | చెన్నై: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) పోరుకు వేళయైంది. గురువారం నుంచి చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా యూటీటీకి తెరలేవనుంది. ఇప్పటి వరకు కలిసికట్టుగా ఆడిన ప్లేయర్లు లీగ్‌లో ప్రత్యర్థులుగా తలపడనున్నారు.
ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో ఆకట్టుకున్న మనికా బాత్రా, శరత్‌కమల్, హర్మీత్దేశాయ్ లాంటి ప్లేయర్లకు తోడు తెలంగాణ యువ ప్యాడ్లర్ ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ ఆయా ఫ్రాంచైజీల తరఫున పోటీకి దిగనున్నారు.
గత సీజన్‌కు భిన్నంగా ఈసారి ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ఇందులో చెన్నై లయన్స్, అహ్మదాబాద్ ఎస్జీ పైపర్స్, దబాంగ్ ఢిల్లీ టీటీసీ, అథ్లెడ్ గోవా చాలెంజర్స్, జైపూర్ ప్యాట్రియాట్స్, పీబీజీ బెంగళూరు స్మాషర్స్, పుణెరీ పల్టాన్, యూముంబా ఉన్నాయి.
మొత్తం 17 రోజుల పాటు టీటీ అభిమానులను అలరించనున్న లీగ్ సెప్టెంబర్ 7న ముగియనుంది. బుధవారం మీడియా సమావేశంలో అన్ని జట్లకు చెందిన ప్లేయర్లు పాల్గొని పలు అంశాలను పంచుకున్నారు.