న్యూఢిల్లీ: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్లు నిఖత్ జరీన్, మహమ్మద్ హుసాముద్దీన్ టైటిల్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన మహిళల 48-51కిలోల ఫైనల్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0తో నీతు(హర్యానా)పై అద్భుత విజయం సాధించింది. బౌట్లో ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన నిఖత్..ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఈ హైదరాబాదీ రౌండ్ రౌండ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయింది.
తన పవర్ఫుల్ పంచ్‌లకు తోడు జాబ్స్, హుక్స్‌తో అంతగా అనుభవం లేని హర్యానా బాక్సర్‌పై ముప్పేటా దాడి చేసింది. టోర్నీలో సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ టైటిల్‌తో మెరిసింది. మరోవైపు పురుషుల 55-60కిలోల తుది పోరులో మహమ్మద్ హుసాముద్దీన్ 3-2తో దీపక్(ఎస్‌ఎస్‌సీబీ)పై ఉత్కంఠ విజయం సాధించాడు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో హుసాముద్దీన్ గెలుపు కోసం తుదికంటా పోరాడాడు. ప్రత్యర్థి నుంచి దీటైన పోటీ ఎదురైనా వెరవకుండా హుసాముద్దీన్ చాంపియన్ ఆటతీరు కనబరిచాడు. ఈ క్రమంలో గాయమైనా వెనుకకు తగ్గలేదు. 50-55కిలోల బౌట్లో జాదుమణిసింగ్ 5-0తో పవన్ బర్తాల్పై ఘన విజయంతో తొలిసారి జాతీయ చాంపియన్‌గా నిలిచాడు. మిగతా బౌట్లలో లవ్లీనా బొర్గోహై(70-75కి) సనామా చానుపై గెలిచి పసిడి సొంతం చేసుకోగా ప్రీతి(51-54కి), ప్రాంజల్ యాదవ్(60-65కి), ప్రియ(57-60కి), అల్ఫీయాన్ ఖాన్(80+కి), ఆదిత్య ప్రతాప్(60-65కి), అభినాశ్ జమ్వాల్(75-80కి) టైటిల్ విజేతలుగా నిలిచారు.