తెలంగాణ గోల్డెన్ పంచ్ గర్ల్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన ఆమె.. ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్ క్రీడల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. దీనికోసం జరిగిన అర్హత పోటీల్లో హర్యానాకు చెందిన మీనాక్షిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన నిఖత్.. 7-0తో ఆమెను మట్టికరిపించింది.
మ్యాచ్ ఆద్యంతం పూర్తి కంట్రోల్లో కనించిన ఆమె పవర్ఫుల్ పంచులతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. అదే సమయంలో రింగ్‌లో చురుకుగా కదులుతుండటంతో ప్రత్యర్థి ఆమెపై ఒక్క పంచ్ కూడా ల్యాండ్ చేయలేకపోయింది. ఈ విజయంతో కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ బెర్తు ఖాయమైంది.
ఆమెతోపాటు ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో భారత ఖ్యాతిని పెంచిన లవ్లీనా బోర్గోహెయిన్ కూడా కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించింది. అలాగే నీతూ (48 కేజీల విభాగం), జాస్మిన్ (60 కేజీల విభాగం) కూడా అర్హత పోటీల్లో విజేతలుగా నిలిచారు.