Andhra Team : గత కొంత కాలంగా దేశవాళీ క్రికెట్లో తేలిపోతున్న ఆంధ్ర జట్టుకు త్వరలోనే మహర్ధశ రాబోతోంది. వచ్చే డొమెస్టిక్ సీజన్లో న్యూజిలాండ్ మాజీ కోచ్ గ్యారీ స్టీడ్ (Gary Stead) ఆ టీమ్‌కు కోచింగ్ ఇవ్వనున్నాడు. కివీస్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా నిలిపిన స్టీడ్ అనుభవం తమ జట్టు రాతను మారుస్తుందని ఆంధ్ర క్రికెట్ సంఘం (Andhra Cricket Association) తెలిపింది. న్యూజిలాండ్ కోచ్‌ను ఆంధ్రకు కొత్త కోచ్‌గా నియమిస్తు్న్న విషయాన్ని శనివారం ఏసీఏ (ACA) అధికారికంగా వెల్లడించింది.
‘మేము మొదట్లో ఆస్ట్రేలియా కోచ్ అయితే బాగుండు అనుకున్నాం. కానీ, ఒక స్నేహితుడు గ్యారీ స్టీడ్ పేరును సూచించాడు. న్యూజిలాండ్‌కు టెస్టు గదను సాధించి పెట్టిన అతడిని ఎందుకు తీసుకోకూడదు? అని అన్నాడు. దాంతో.. మేము ఆయనను సంప్రదించాం. మొదటి సమావేశం నుంచి స్టీడ్ ఆంధ్రకు కోచింగ్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు మాతో చర్చలకు ముందే ఆయన మా జట్టు రికార్డులు.. ఇటీవలి ప్రదర్శనకు సంబంధించిన విషయాల్ని తెలుసుకున్నాడు’ అని ఏసీఏ సెక్రటరీ సనా సతీశ్ బాబు (Sana Satish Babu) క్రిక్‌బజ్‌తో వెల్లడించాడు. స్టీడ్ వచ్చే వారంలో విశాఖపట్టణం వస్తాడని ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి.
🚨GARY STEAD TO ANDHRA🚨
The Andhra Cricket Association has pulled off a coup by signing former New Zealand coach Gary Stead, who won the WTC in 2021 😮😮 pic.twitter.com/66Wt21WuxV
— Cricbuzz (@cricbuzz) September 13, 2025
న్యూజిలాండ్ జట్టుకు ఏడేళ్లు హెడ్‌కోచ్‌గా సేవలందించాడు గ్యారీ స్టీడ్. ఆయన మార్గనిర్దేశనంలోనే కివీస్ టెస్టులు, వన్డేలు.. వరల్డ్ నంబర్ 1 ర్యాంక్ సొంతం చేసుకుంది. స్టీడ్ హయాంలో బ్లాక్ క్యాప్స్ 2019లో వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2021లో భారత్‌ను ఓడించిన కేన్ విలియమ్సన్ సేన టెస్టు గదను తన్నుకుపోయింది. ఈ ఏడాది జూన్‌లో న్యూజిలాండ్ క్రికెట్‌తో ఆయన ఒప్పందం ముగిసిపోయింది.
ఒకప్పుడు దేశవాళీ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించిన ఆంధ్ర జట్టు ఈమధ్య పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. 2022-23 సీజన్లో రంజీ నాకౌట్ చేరిన ఆంధ్ర.. క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. అనంతరం వరుసగా 2023-24, 2024-25 ఎడిషన్లలో నాకౌట్ పోరుకు అర్హత సాధించలేదు. రికీ భూయ్, శ్రీకర్ భరత్, నితీశ్ కుమార్ రెడ్డి రాణిస్తున్నప్పటికీ సమిష్టితత్వం కొరవడడం ఆంధ్రను వేధిస్తోంది.