Asian Games | ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ విధ్వంసం సృష్టించింది. పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. గ్రూప్-ఎలో భాగంగా జరిగిన ఈ పోరులో నేపాల్ 273 పరుగుల తేడాతో మంగోలియాను చిత్తుచేసింది. పరుగుల పరంగా ఒక అంతర్జాతీయ టీ-20 మ్యాచ్‌లో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. కుషాల్ మల్ల (50 బంతుల్లో 137 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) భారీ సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ రోహిత్ పడేల్ (27 బంతుల్లో 61; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఇక చివర్లో దీపేంద్ర సింగ్ (10 బంతుల్లో 52 నాటౌట్; 8 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అనంతరం ఛేదనలో మంగోలియా 41 పరుగులకు ఆలౌటైంది.
* అంతర్జాతీయ టీ20ల్లో ఒక జట్టు 300 పైచిలుకు పరుగులు చేయడం ఇదే తొలిసారి. గతంలో ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్ చేసిన 278 పరుగుల స్కోరు రెండో స్థానానికి చేరింది.
* కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్‌లను కలుపుకున్నా.. ఇదే అత్యధిక స్కోరు.
* 34 బంతుల్లో-ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసేందుకు కుషాల్ మల్లకు అవసరమైన బంతులు. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే వెగవంతమైంది. రోహిత్ శర్మ, డేవిడ్ మల్లర్ (35 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నారు.
* 9-పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా దీపేంద్ర సింగ్ చరిత్రకెక్కాడు. 2007 ప్రపంచకప్‌లో భారత ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లో అర్ధశతకం చేయగా.. ఈ మ్యాచ్ ద్వారా దీపేంద్ర ఆ రికార్డును బద్దలుకొట్టాడు.
* 273-పరుగుల పరంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇదే అతిపెద్ద విజయం. గతంలో చెక్ రిపబ్లిక్ జట్టు టర్కీపై 257 పరుగుల తేడాతో గెలుపొందింది.
* 520-ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ స్ట్రయిక్‌రేట్ ఇది.అంతర్జాతీయ టీ20ల్లో పదికంటే ఎక్కువ బాల్స్ ఆడిన ప్లేయర్లలో ఇదే అత్యధిక స్ట్రయిక్‌రేట్.
* 26- ఈమ్యాచ్‌లో నమోదైన సిక్సర్ల సంఖ్య. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఇదే అత్యధికం. గతంలో ఐర్లాండ్‌పై అఫ్ఘనిస్థాన్ 22 సిక్సర్లు బాదింది.