Neeraj Chopra | లాసానే: భారత స్టార్ జావెలిన్త్రోయర్ నీరజ్ చోప్రా.. డైమండ్ లీగ్ పోరుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్లో రజత పతకంతో మెరిసిన నీరజ్…గురువారం రాత్రి జరిగే డైమండ్ లీగ్లో సత్తాచాటడం ద్వారా ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని చూస్తున్నాడు.
గజ్జల్లో గాయంతో పారిస్ విశ్వక్రీడల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన చోప్రా.. లాసానే డైమండ్ లీగ్లో రాణించేందుకు తహతహలాడుతున్నాడు. గాయం నుంచి కొంత తేరుకున్న ఈ యువ అథ్లెట్ ప్రస్తుతం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
పారిస్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్..ఈ టోర్నీలో పోటీపడటం లేదు. నదీమ్ మినహా పారిస్లో ఆడిన దాదాపు అందరూ ప్లేయర్లు లాసానేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పట్టుదలతో ఉన్నారు. లాసానే తర్వాత సెప్టెంబర్ 5న జ్యూరిచ్లో మరోమారు డైమండ్ లీగ్ పోటీలు జరుగనుండగా, సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్లో ఫైనల్స్ ఉన్నాయి.
టాప్-6లో నిలిచిన అథ్లెట్లు తుదిపోరుకు అర్హత సాధిస్తారు. 2022లో డైమండ్ లీగ్ విజేతగా నిలిచిన నీరజ్..గతేడాది రెండో స్థానంతో సరిపెట్టుకోగా జాకబ్ వాల్దిచ్ టైటిల్ దక్కించుకున్నాడు. సీజన్ ముగిసిన తర్వాత గాయానికి శస్త్రచికిత్స తీసుకుంటానని చోప్రా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.