హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 19వ ఆసియాడ్ మొదటి రోజు నుంచి భారత్ పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే భారత్ సాధించిన పతకాల సంఖ్య 80కి చేరువైంది. తాజాగా భారత జావెలిన్ త్రోయర్, ఒలింపియన్ నీరజ్ చోప్రా పసిడి పతకం సాధించాడు.
నీరజ్ చోప్రా ఈటెను 88.88 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని ఒడిసిపట్టాడు. ఇదే ఈవెంట్లో భారత్‌కు చెందిన మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా రజత పతకం నెగ్గాడు. తన నాలుగో ప్రయత్నంలో ఈటెను 87.54 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలువడం ద్వారా రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఇక జపాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ డీన్ రొడెరిక్ జెంకీ తన ఐదో ప్రయత్నంలో ఈటెను 82.68 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకున్నాడు. అదేవిధంగా మెన్స్ 4×400 రిలేలో బంగారు పతకం, ఉమెన్స్ 4×400 రిలేలో రజతం భారత్ సొంతమయ్యాయి. ఇక 35 కిలోమీటర్ల రేసు వాక్ మిక్స్డ్ టీమ్స్ ఫైనల్లో భారత్‌కు కాంస్యం దక్కింది.