చెన్నై: చెన్నై వేదికగా ప్రతిష్ఠాత్మక జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీకి మంగళవారం తెరలేవనుంది. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 1500 మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మొదలుకానున్న 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ టోర్నీలో 30 జట్లు 155 ఈవెంట్లలో పతకాల కోసం బరిలోకి దిగనున్నాయి.
దేశంలో అతిపెద్ద పారా టోర్నీగా భావిస్తున్న ఇందులో స్టార్ అథ్లెట్లు సుమిత్ అంటిల్, మనోజ్ సభాపతి, మనోజ్ సింగరాజ్, మరియప్పన్ తంగవేలు, ముతురాజా, నవ్దీప్సింగ్, యోగేశ్ కతునియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీ కోసం తమిళనాడు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా(పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర జఝారియా పేర్కొన్నాడు.