Arjentina : ఫిఫా వరల్డ్ కప్ సంబురాలు అర్జెంటీనాలో అంబరాన్ని అంటుతున్నాయి. దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ జట్టు వరల్డ్ కప్ గెలవడంతో ప్రజలంతా వేడుకలు చేసుకుంటున్నారు. ట్రోఫీ గెలిచి స్వేదేశం చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది. అర్జెంటీనా రాజధాని బునోస్ఎయెర్స్లో ఈరోజు మధ్యాహ్నం జరిగే వేడుకల్లో మెస్సీ, టీమ్ ఆటగాళ్లు పాల్గొంటారు. దాంతో ప్రభుత్వం మంగళవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ‘దేశం ఎంతగా సంతోషిస్తుందో చూసేందుకు నేను అర్జెంటీనాలో ఉండాలి అనుకుంటున్నా’ అని ఫైనల్లో విజయం తర్వాత మెస్సీ అన్నట్టు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తెలిపింది. చివరగా 1986లో డిగో మారడోనా కెప్టెన్సీలో అర్జెంటీనా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
దోహాలో డిసెంబర్ 18న (ఆదివారం) రాత్రి అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఫైనల్ ఇరు దేశాల అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టింది. హోరాహోరీగా సాగిన టైటిల్ పోరులో అర్జెంటీనా 4-2తో విజయం సాధించింది. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న మెస్సీ తొలి గోల్ అందించి ఫ్రాన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే ఎంబాపే రెండు గోల్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత కూడా 3-3 స్కోర్ సమం అయింది. హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. దాంతో, పెనాల్టీ షూట్లో అర్జెంటీనా 4-2తో చిరస్మరణీయ విజయం నమోదుచేసింది. కెరీర్లో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడాలనే మెస్సీ కల నెరవేరింది. 2014లోనూ మెస్సీ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కానీ అర్జెంటీనా ఫైనల్లో జర్మనీ చేతిలో ఓడిపోయింది.