Sahaja Yamalapalli | తండ్రితో కలిసి సరదాగా గ్రౌండ్ బాట పట్టిన ఆ చిన్నారి.. టెన్నిస్ బంతి చూసి ఆకర్శితురాలైంది. పదేండ్ల ప్రాయంలో సంబురంగా రాకెట్ పట్టిన ఆ బుడత.. ఇప్పుడు మూడు ఐటీఎఫ్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని దేశంలో మూడో ర్యాంక్‌కు చేరింది!
పట్టుదల ఉంటే సాధ్యం కానిదంటూ లేదని నిరూపిస్తూ.. ఖర్చుతో కూడిన టెన్నిస్ క్రీడలో ప్రతిభ చాటుతున్నది. జూనియర్ స్థాయిలో పెద్దగా అనుభవం లేకపోయినా.. సీనియర్ సర్క్యూట్లో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అద్భుతాలు చేస్తున్న ఆ అమ్మాయి.. భవిష్యత్తు సానియా మీర్జాగా మన్ననలు అందుకుంటోంది!!
సామాజిక మాధ్యమాలు, సినిమాలకు దూరంగా.. గంటల తరబడి కోర్టులో చెమటోడుస్తూ.. గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడటమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ యువ టెన్నిస్ ప్లేయర్ యామలపల్లి సహజతో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
కుటుంబ నేపథ్యం ఏంటీ?
మా సొంతూరు ఖమ్మం. నా చిన్నప్పుడే అమ్మానాన్న సుప్రియ, భవాని కుమార్ హైదరాబాద్‌కు వచ్చేశారు. గతంలో నాన్న సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్లు.. కానీ నా ట్రైనింగ్, టోర్నీల కారణంగా అది సాధ్యపడక పోవడంతో ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాల్లో గెస్ట్ లెక్చరర్‌గా కొనసాగుతున్నారు.
టెన్నిస్‌పై మక్కువ ఎలా కలిగింది?
చిన్నప్పుడు సాధారణ ఫిట్నెస్ కోసం నాన్న సరూర్ నగర్ స్టేడియానికి తీసుకెళ్లేవారు. పదేండ్ల వయసులో టెన్నిస్ అంటే మక్కువ ఏర్పడింది. ఆరంభంలో అక్కడే ప్రాక్టీస్ చేసేదాన్ని.. ఆ తర్వాత ఎల్బీస్టేడియంలో శిక్షణ తీసుకున్నా.
ప్రొఫెషనల్ కెరీర్ ఎప్పటి నుంచి?
పదో తరగతికి వచ్చేసరికి నాకు టెన్నిస్‌పై ఇష్టం మరింత పెరిగింది. దీంతో ఇక భవిష్యత్తులో ఆటతోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. శిక్షణ కోసం రోజుకు దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించేదాన్ని. ప్రతీ క్షణం నాన్న నా వెంట ఉండేవారు. ప్రహ్లాద్ కుమార్ జైన్ సార్ సూచనలతో ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ ప్రారంభించా. చెన్నై వేదికగా 2017లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో సత్తాచాటడంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. దాని వల్లే యూఎస్ కాలేజీలో స్కాలర్షిప్ లభించింది.
చదువు ఎలా సాగుతోంది?
కెరీర్ కొనసాగిస్తూనే.. నాన్న ప్రైవేట్ క్లాస్‌ల సహాయంతో ఇంటర్ పూర్తి చేశా. అమెరికాలో ఫుడ్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పొందా. సినిమాలు, సామాజిక మాధ్యమాల జోలికి వెళ్లను. నిజం చెప్పాలంటే అసలు అంత సమయమే లభించదు.
ఇప్పటి వరకు సాధించిన విజయాలు?
మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్‌లో మూడు ఐటీఎఫ్ టైటిల్స్ గెలిచా.. ఒక దాంట్లో రన్నరప్‌గా నిలిచా. ఇటీవల జరిగిన సోలాపూర్ ఐటీఎఫ్ 25కే టోర్నీలో విజేతగా నిలిచా.
ప్రస్తుత ర్యాంకింగ్ ఎంత?
గత నెలలో విడుదల చేసిన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 340వ ర్యాంక్‌కు చేరుకున్నా.. ఈ ఏడాది చివరి వరకు దాన్ని 200కు తగ్గించాలని నిర్ణయించుకున్నా. అప్పుడే గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయర్స్ ఆడే అవకాశం దక్కుతుంది. దేశంలో చూసుకుంటే.. అంకిత రైనా, కర్మన్ కౌర్ థండీ తర్వాత మూడో ర్యాంక్‌లో ఉన్నా.
బలాబలాలు?
మొదటి నుంచి ఫోర్ హ్యాండ్ షాట్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టా. మన బలాబలాలను అంచనా వేసుకొని ప్రత్యర్థులపై పైచేయి సాధించడం ముఖ్యం. ఏకకాలంలో రెండు చేతుల నుంచి సమాన వేగంగా షాట్లు ఆడగలను.
ఇష్టమైన ప్లేయర్?
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ఆట చూస్తూ పెరిగా. గ్రౌండ్లో సెరెనా దూకుడు బాగా నచ్చుతుంది.
స్వతహాగా నేను కూడా అదే దూకుడుతో ఆడతా. ఇగా స్వియాటెక్ ఆట కూడా ఇష్టమే. ఇక భారత్ విషయానికి వస్తే.. హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా అందరికీ ఆదర్శమే. లియాండర్ పేస్, రోహాన్ బోపన్న కూడా యువ ఆటగాళ్లను బాగా ప్రోత్సహిస్తారు.
భవిష్యత్తు లక్ష్యాలేంటి?
గ్రాండ్‌స్లామ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధించడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. రోజుకు 8 గంటలకు పైగా కఠోర సాధన చేస్తున్నా.
టెన్నిస్‌లో రాణించాలంటే ప్రతిభ ఒక్కటే సరిపోదు. కఠోర శ్రమతో పాటు ఆర్థిక వనరుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ టోర్నీలు ఆడడం ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఇబ్బంది వల్లే ఆరంభంలో ఎక్కువ టోర్నీలు ఆడలేకపోయా. అమెరికాలో చదువుతున్న సమయంలో విరివిగా టోర్నీలు ఆడే అవకాశం దక్కడంతో ర్యాంకింగ్ మెరుగుపడింది. స్పాన్సర్లు లేకపోవడంతో.. జైన్ సార్, నాన్న స్నేహితుల సాయంతో టోర్నీల్లో పాల్గొంటున్నా. ఆర్థిక అండ లభిస్తే.. మెరుగైన ఫలితాలు సాధిస్తాననే నమ్మకముంది.