Naman Dhir | ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘకాలం ఫినిషర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విండీస్ వీరుడు కీరన్ పొలార్డ్ నిష్క్రమణ తర్వాత ఆ జట్టుకు లోయరార్డర్లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే బ్యాటర్ లేక తంటాలు పడింది. కానీ ఈ సీజన్లో ముంబైకి నమన్ ధీర్ రూపంలో ఆ బెంగ తీరింది. ఈ సీజన్లో నమన్.. ముంబై విజయాల్లో ‘అన్సంగ్ హీరో’ అయ్యాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి వికెట్‌ను కాపాడుకోవడంతో పాటు జట్టుకు అవసరమైన సమయంలో దంచికొడుతూ కీలక పరుగులు రాబడుతున్నాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై ముంబై బ్యాటర్లు 18వ ఓవర్ దాకా చేసిన స్కోరు 132/5 మాత్రమే. కానీ అప్పుడే క్రీజులోకి వచ్చిన నమన్.. ముకేశ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు, రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు.
8 బంతుల్లోనే అతడు చేసిన రన్స్‌తో ముంబై పోరాడగలిగే స్కోరును సాధించింది. నమన్ ఈ సీజన్ ఆరంభంలో లక్నోతో మ్యాచ్ ఆడుతూ 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 46 రన్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో కిందికొచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. హర్యానాలోని అంబాలాలో పుట్టి పెరిగిన నమన్.. పంజాబ్ టీ20 కప్‌లో అదరగొట్టాడు. రెండు సీజన్లలో అతడు 400+ పరుగులు చేసి ముంబై స్కౌట్స్ దృష్టిలో పడ్డాడు. ఇంకేముంది! ముంబై ఈ కుర్రాడికి వేలంలో రూ. 5.25 కోట్ల ధరతో దక్కించుకుని వరుస అవకాశాలిస్తూ ప్రోత్సహిస్తున్నది. జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని నమన్.. ఈ సీజన్లో ఇప్పటిదాకా 13 మ్యాచ్‌లలో 102 బంతులాడి ఏకంగా 182 సగటుతో 186 పరుగులు చేశాడు. పొలార్డ్ మాదిరిగానే నమన్ కూడా ఆల్‌రౌండర్ అయినప్పటికీ ముంబై ఈ కుర్రాడిని బ్యాటింగ్‌లో ఫినిషర్‌గా వినియోగించుకుంటున్నది.
బ్యాటర్‌గానే గాక ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా కదులుతూ పరుగులను అడ్డుకోవడమే గాక కీలక క్యాచ్‌లు అందుకుంటున్నాడు. ఈ సీజన్లో అతడు ఇప్పటిదాకా 12 క్యాచ్‌లు పట్టాడు. తన సక్సెస్‌కు ముంబై బ్యాటింగ్ కోచ్ పొలార్డ్ కారణమని అంటున్న నమన్ ఆటతీరు చూస్తే ప్రస్తుత ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఈ ఫ్రాంచైజీకి ఆరంభంలో వచ్చినప్పుడు ఆడినట్టే ఆడుతున్నాడని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. నమన్ ఇదే జోరు కొనసాగిస్తే రాబోయే రోజుల్లో అతడు ముంబైకి కీలక ఆటగాడిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.