Nada Hafez | పారిస్: ఒక మహిళ జీవితంలో గర్భాధారణ అత్యంత కీలకం. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యాక ఎక్కువ మంది స్త్రీలు బెడ్రెస్ట్కే పరిమితమవుతారు. కానీ ఈజిప్టుకు చెందిన ఫెన్సర్ నదా హఫెజ్ మాత్రం ఏడు నెలల గర్భిణీగా ఉన్నా ఒలింపిక్స్లో బరిలోకి దిగింది. ఫెన్సింగ్ అంటేనే ప్రమాదకర క్రీడ అయినప్పటికీ ఆమె కడుపులో ఏడు నెలల చిన్నారితో పోటీలలో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ‘మీకు వేదికపై కనిపిస్తోంది ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు నేను మరొకరు నా ప్రత్యర్థి. కానీ అక్కడున్నది ముగ్గురు.
నా కడుపులో ఏడు నెలల చిన్నారి ఉంది. ఈ ప్రయాణంలో నేను, నా బేబీ భౌతికంగానే గాక మానసికంగానూ సవాళ్లను ఎదుర్కుంటున్నాం. కానీ జీవితం, క్రీడల సమతుల్యతను కాపాడుకోవాలంటే తప్పుకుండా పోరాడాల్సిందే. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన నా భర్త, కుటుంబసభ్యులకు ధన్యవాదాలు. గతంలో రెండుసార్లు బరిలోకి దిగినా పారిస్ ఒలింపిక్స్ నాకు, నా కడుపులో పెరుగుతున్న లిటిల్ ఒలింపియన్కు ఎంతో ప్రత్యేకం’ అని రాసుకొచ్చింది. హఫెజ్ తన తొలి మ్యాచ్లో అమెరికాకు చెందిన ప్రపంచ పదో ర్యాంకర్ ఎలిజిబెత్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. కానీ ఈ రౌండ్లో జియోన్ హయాంగ్ (దక్షిణ కొరియా)చేతిలో ఓడింది.