హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో ముంబై మీటియర్స్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. బుధవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై మీటియర్స్ 3-0(15-12, 15-10, 15-11)తో ఢిల్లీ తూఫాన్స్పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన ముంబై వరుస సెట్లలో ఢిల్లీని చిత్తుచేసింది. ఢిల్లీ ప్లేయర్ మహమ్మద్ జసిమ్ సూపర్ సర్వ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా..అభినవ్ సలార్, శుభమ్ చౌదరి ముంబైని ఆధిక్యంలో నిలిపారు.
కెప్టెన్ అమిత్ గులియా సూపర్ సర్వ్లతో ఢిల్లీపై ఒత్తిడి పెంచుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నారు. ఢిల్లీ కెప్టెన్ సక్లయిన్ తారిఖ్ మెరుగైన ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించే ప్రయత్నం చేయగా, సహచరుల వైఫల్యం జట్టును ఓటమి వైపు నిలిపింది. ఫారెన్ ప్లేయర్లు మతియస్ లాఫ్ట్నెస్, పీటర్ అస్లాడ్ ఒస్టిక్ తమ బ్లాకింగ్ నైపుణ్యంతో ముంబై విజయంలో కీలకమయ్యారు.