రియాద్: ఐఎస్ఎల్ మాజీ చాంపియన్ ముంబై సిటీ ఫుట్‌బాల్ క్లబ్ సరికొత్త అధ్యాయం లిఖించింది. ఏఎఫ్సీ ఆసియా చాంపియన్స్ లీగ్‌లో విజయం సాధించిన మొదటి భారతీయ ఫుట్‌బాల్ క్లబ్‌గా ముంబై నిలిచింది. లీగ్ దశ రెండో మ్యాచ్‌లో ముంబై 2-1తో ఇరాక్‌కు చెందిన ఎయిర్ ఫోర్స్ క్లబ్‌ను ఓడించి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. డియాగో మౌరిసియో (70వ ని), రాహుల్ భెకె (75 ని) రెండు గోల్స్‌తో విజృంభించడంతో జట్టు గెలుపు బాట పట్టగా.. ప్రత్యర్థి తరఫున హమ్మది (59వ ని) ఏకైక గోల్ చేశాడు. గ్రూప్-బీలో ఉన్న ముంబై తొలి మ్యాచ్‌లో 0-3తో అల్ షాబాబ్ ఎఫ్‌సీ చేతిలో ఓటమిని చవిచూసింది. తాజా విజయంతో 3 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో గురువారం అల్ జజీరా ఎఫ్ఎస్సీ (యూఏఈ)తో ముంబై తలపడనుంది.