IPL 2026 | రీతురాజ్ గైక్వాడ్ తిరిగి వస్తే రాబోయే ఐపీఎల్ (IPL 2026) సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ మరింత బలపడుతుందని ఆ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. గత సీజన్లో కెప్టెన్ గైక్వాడ్ మధ్యలోనే మోచేయి గాయం కారణంగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. దాంతో గైక్వాడ్ స్థానంలో ధోనీ సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు బ్యాటింగ్ ఇబ్బందికరంగా ఉన్నది. ముగిసిన గత సీజన్లో 14 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. చెన్నై జట్టు గైక్వాడ్‌ను కొనసాగిస్తుందని తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్ గురించి కొంచెం ఆందోళన పడ్డామని.. కానీ ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్ స్థిరపడిందని భావిస్తున్నానని చెప్పారు. గాయపడ్డ రీతురాజ్ గైక్వాడ్ తిరిగి వస్తాడంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
ఈ ఏడాది చివర్లో మినీ వేలంతో జట్టను మరింత బలోపేతం చేయడానికి ఫ్రాంచైజీ ప్రయత్నిస్తుందని తెలిపాడు. తాము ఈ సీజన్లో నిర్లక్ష్యంగా ఉన్నామని తాను చెప్పలేనని.. అయితే, అధిగమించాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయని తెలిపాడు. డిసెంబర్లో జరుగబోయే మినీ వేలంతో ఆ లోపాలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పాడు. ఏప్రిల్ 8న ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రీతురాజ్ గైక్వాడ్ చివరి మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా ధోనీ గత రెండు సీజన్లలో సూపర్ కింగ్స్ ప్రదర్శన ఊహించినదాని కంటే బాగా లేదని అంగీకరించాడు. లోపాలను గుర్తించడం జట్టుకు ముఖ్యమని సీనియర్ ఆటగాడు తెలిపాడు. గత సీజన్లో జట్టుకు అంతా ఏమీ బాగా జరుగలేదని.. ఆశించిన మేర ప్రదర్శన ఇవ్వలేకపోయామని చెప్పాడు. కానీ, తప్పిదాల నుంచి నేర్చుకోవడం ముఖ్యమైందని తాను భావిస్తున్నానని.. ఈ సీజన్ బాగా లేదని.. ఎక్కడ తప్పుడు జరిగిందనే ప్రశ్నను ఎదుర్కోవాల్సి ఉంటుందని.. ఇదే ప్రశ్న తాము గత ఏడాది కూడా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్.