హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జరిగిన జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో తెలంగాణ సెయిలర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన రెగెట్టా టోర్నీ శనివారంతో ముగిసింది. వివిధ విభాగాల్లో తెలంగాణ సెయిలర్లు సత్తాచాటుతూ పతకాలు కొల్లగొట్టారు. బాలుర అండర్-15 విభాగంలో మహమ్మద్ రిజ్వాన్ పసిడి పతకం గెలుచుకోవడమే గాక ‘బాయ్స్’ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తనుజ కామేశ్వర్- శ్రవణ్ కత్రావత్ జోడీ స్వర్ణం దక్కించుకుంది.
అండర్-15 బాలికల విభాగంలో రాష్ట్ర సెయిలర్ లాహిరి కొమురవెల్లి రజత పతకం సొంతం చేసుకుంది. దీనితో పాటు ప్రతిష్టాత్మక ఎస్హెచ్ బాబు స్మారక ట్రోఫీని దక్కించుకుంది. అండర్-19 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దీక్షిత, గణేశ్ రజతం సాధించారు. అండర్-15 బాలికల విభాగంలో చంద్రలేఖ, బాలుర కేటగిరీలో వినోద్ కాంస్యాలు కైవసం చేసుకున్నారు.