హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా 15వ మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్లో రాష్ట్ర యువ సెయిలర్ గోవర్ధన్ పతక జోరు కనబరిచాడు. శనివారం ముగిసిన టోర్నీలో బాలుర అండర్-16 అప్టిమిస్టిక్ విభాగంలో గోవర్ధన్..మాన్సూన్ రెగెట్టా ట్రోఫీతో పాటు ఎస్హెచ్ బాబు ట్రోఫీ, స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ క్రమంలో మాన్సూన్ రెగెట్టాలో ట్రిపుల్ ధమాకా పూర్తి చేశాడు. మరోవైపు ఆకాశ్(మైసూర్), రిజ్వాన్ మహమ్మద్(తెలంగాణ) వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. అండర్-18 విభాగంలో ఉత్తమ సింగిల్ హ్యాండర్ ఐఎల్సీఏ 4 బాలికల ట్రోఫీని అలియా సబ్రీన్(ఒడిశా), అక్షత్(మధ్యప్రదేశ్) దక్కించుకున్నారు. 420 అంతర్జాతీయ ఓపెన్ విభాగంలో రాష్ర్టానికి చెందిన తనూజ కామేశ్వర్, గణేశ్ జోడీ పసిడి పతక ఖాతాలో వేసుకుంది.