లాహోర్: అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వేల పరుగుల మైలురాయి దాటిన తొలి ఆప్ఘనిస్థాన్ ఆటగాడిగా మహ్మద్ నబీ రికార్డు సృష్టించాడు. ఆసియా కప్-2023 లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో నబీ ఈ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో నబీ 32 బంతులను ఎదుర్కొని 65 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో 5000 పరుగుల మైలురాయిని అధిగమించాడు.
అంతేగాక, కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసి.. వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన తొలి ఆఫ్ఘన్ బ్యాటర్‌గా కూడా నబీ రికార్డు నెలకొల్పాడు. గత నెలలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ 26 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును అతను బద్దలు కొట్టాడు. మొత్తం 259 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నబీ 24.56 సగటుతో 5011 పరుగులు చేశాడు. మొత్తం 238 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీతోపాటు 21 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అత్యుత్తమ స్కోరు 116 పరుగులు.
ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ షహజాద్ 156 మ్యాచ్‌లలో 4,811 పరుగులు, అస్గర్ ఆఫ్ఘన్ 195 మ్యాచ్‌లలో 4,246 పరుగులు నబీ తర్వాత ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. నబీ మూడు టెస్టుల్లో 5.50 సగటుతో 33 పరుగులు, 147 వన్డేల్లో 27.18 సగటుతో 3,153 పరుగులు చేశాడు. వన్డేల్లో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 109 టీ20 మ్యాచ్‌లలో 22.25 సగటుతో 1,825 పరుగులు పిండుకున్నాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. అత్యుత్తమ స్కోరు 89 పరుగులు.