Minister Srinivas Goud | హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని 17వేల గ్రామాల్లో నిర్మించిన క్రీడా ప్రాంగణాలకు స్పోర్ట్స్ కిట్స్‌ను అందజేయనున్నట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, క్రీడా శాఖలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. క్రీడా పాలసీ, టూరిజం పాలసీ, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు, సీఎం కప్ నిర్వహణ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న క్రీడా మైదానాల పురోగతి, పర్యాటక కేంద్రాల్లో నిర్మించ తలపెట్టిన అమ్యూజ్మెంట్ పారులు, అడ్వెంచర్ టూరిజం,
చిల్డ్రన్స్ పారుల అభివృద్ధి, మ్యూజికల్ ఫౌంటెన్, లేజర్‌షో, జెయింట్‌వీల్, వేవ్పూల్, వాటర్రైడ్స్, వాటర్‌గేమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆయా అభివృద్ధి పనులతో పాటు పర్యాటక ప్రదేశాల ప్రమోషనల్ కార్యక్రమాలను, నూతన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామాయ్యర్తో పాటు ఆయా శాఖల డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.