Michael Vaughan | రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అందుబాటులో లేకపోవడం వల్లే భారత్‌తో ఓవల్ టెస్టులో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోయిందని మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ఆఖరి టెస్టు చివరి రోజున ఇంగ్లండ్ జట్టు తొందరపాటును ప్రదర్శించిందని పేర్కొన్నాడు. మ్యాచ్‌ను గెలిచేందుకు కేవలం 35 పరుగులు మాత్రమే అవసరమని.. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు మిగిలే ఉన్నాయని మాజీ కెప్టెన్ తెలిపాడు. భారత్ అద్భుతంగా రాణించి ఆరు పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-2 తేడాతో సమం చేసిందని చెప్పాడు. బెన్ స్టోక్స్ జట్టులో ఉండి ఉంటే.. ఇంగ్లండ్ ఈ టెస్టులో గెలిచి ఉండేదని.. ఆల్‌రౌండర్ జట్టులో కీలకపాత్ర పోషిస్తున్నాడని చెప్పాడు. జట్టును మానసికంగా బలంగా ఉండేలా చూస్తాడని చెప్పాడు.
ఐదోరోజు ఉదయం తొందరపాటును ప్రదర్శించిందని.. జట్టు గెలిచేందుకు మంచి భాగస్వామ్యాలను అవసరమని.. దూకుడుగా ఆడే విధానంలో తొందరపాటును ప్రదర్శిస్తారని పేర్కొన్నాడు. హ్యారీ బ్రూక్ అవుట్ కావడంతోనే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కుప్పకూలడం మొదలైందని తెలిపాడు. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయం కారణంగా చివరి టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడాన్ కార్స్‌కు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది నవంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే యాషెస్ సిరీస్‌కు భారత్‌తో జరిగే ఉత్కంఠభరితమైన సిరీస్ ఇంగ్లండ్‌కు మంచి సన్నాహకమని వాన్ తెలిపాడు. ఇంగ్లండ్ ఐదు గొప్ప మ్యాచులను ఆడిందని చెప్పాడు. ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌కు కేవలం పదిమంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారని.. ఓ బౌలర్ ముందుగానే మ్యాచ్‌కు దూరమయ్యాడని, బెన్ స్టోక్స్ కూడా అందుబాటులో లేకుండా పోయాడని చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఆటగాళ్లు అందరూ సంసిద్ధంగా ఉన్నారని తాను భావిస్తున్నానని.. ఆసిస్ పర్యటనకు ముందు బౌలింగ్ లైనప్‌ను సరిదిద్దుకోవాలని.. బెన్ స్టోక్స్ ఫిట్‌గా ఉండాలని.. అతను ఉంటే ఇంగ్లండ్ ఓ జట్టునైనా ఓడించగలదని.. లేకపోతే ఎవరైనా జట్టును ఓడించవచ్చని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.