సిడ్నీ: మిడిలార్డర్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో (103 బ్యాటింగ్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ శతకంతో కదం తొక్కడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున ఇదే తొలి శతకం కావడం గమనార్హం. వర్షం కారణంగా శుక్రవారం ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఓవర్‌నైట్ స్కోరు 13/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ (66; 9 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి బెయిర్‌స్టో పరిస్థితి చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. హమీద్ (6), క్రాలీ (18), మలన్ (3), రూట్ (0), బట్లర్ (0) విఫలమయ్యారు. అంతకుముందు ఆస్ట్రేలియా 416/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చేతిలో మూడు వికెట్లు ఉన్న ఇంగ్లిష్ జట్టు ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 158 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్, బొలాండ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.