Michael Vaughan : ఇంగ్లండ్ దిగ్గజం మైఖేల్ వాన్ (Michael Vaughan) కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ మాజీ క్రికెటర్ తండ్రి గ్రాహమ్ వాన్ (Graham Vaughan) కన్నుమూశాడు. ఈ విషాదకరమైన వార్తను సోమవారం వాన్ అభిమానులతో పంచుకున్నాడు. తన తండ్రి చివరి క్షణాల్లో వెంటే ఉండాలని యాషెస్ సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశానని అతడు పేర్కొన్నాడు. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తండ్రికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నివాళులు అర్పించాడు.
‘నా హీరో, మెంటర్, ముఖ్యంగా నేను ఎల్లప్పుడూ కోరుకునే గొప్ప డాడీ. ఆయనది ఎంతో ప్రశాంతమైన చావు. నా సోదరుడి చేతుల్లో చెయ్యి పెట్టి మరణించాడు. నాన్న ఆఖరి గడియల్లో ఆయనతో అమూల్యమైన 30 గంటలు గడపడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నా. క్యాన్సర్‌తో పోరాడుతూ మంచాన పడిన ఆయన పక్కనే ఉండి.. మాట్లాడుతూ.. ఏడుస్తూ ఉన్నాను.
Michael Vaughan makes heartbreaking tribute as father dies following cancer battlehttps://t.co/mLERM5OgUC
— GB News (@GBNEWS) December 22, 2025
కానీ, డాడీ మాత్రం నవ్వుతుండేవారు. ఆయన తన జీవితాన్ని పరిపూర్ణంగా, సంతోషంగా జీవించారు. అందరికి తనలానే జీవించాలని చెప్పేవారు. తన చివరిక్షణాల్లో షెఫీల్డ్‌లోని సెయింట్ ల్యూక్స్ హాస్పైస్‌లో గడిపిన మా డాడీ అక్కడే ప్రశాంతంగా తనువు చాలించారు’ అని వాన్ తన సుదీర్ఘ పోస్ట్‌లో వెల్లడించాడు.
కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న గ్రాహమ్ వాన్ ఆరోగ్యం ఇటీవల క్షీణించింది. దాంతో.. యాషస్ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న వాన్‌కు విషయం తెలియగానే వెంటనే స్వదేశం వచ్చేశాడు. తన తండ్రి మరణించాడనే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు వాన్. ఆ పోస్ట్‌లో తన తండ్రితో దిగిన అపురూపమైన ఫొటోలను షేర్ చేశాడీ మాజీ కెప్టెన్.