Women’s Asia Cup | దంబుల్లా: ప్రతి రెండేండ్లకోమారు జరిగే మహిళల ఆసియా కప్‌నకు వేళైంది. శుక్రవారం నుంచి దంబుల్లా (శ్రీలంక) వేదికగా ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఆసియాలోని 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఆడనున్న ఈ టోర్నీలో నేపాల్-యూఏఈ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్ తొలి రోజే డిఫెండింగ్ చాంపియన్ భారత్..
పాకిస్థాన్‌తో రాత్రి 7 గంటలకు ఆడబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను ఆరంభించనుంది. శుక్రవారం నుంచి ఈ నెల 24 దాకా జరిగే ఈ టోర్నీలో 8 జట్లు 15 మ్యాచ్‌లు ఆడనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు నేపాల్, యూఏఈ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌లాండ్ ఉన్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టూ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. గ్రూప దశ ముగిసేటప్పటికీ టాప్-2లో ఉన్న రెండు జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 26న రెండు సెమీస్‌లు, 28న ఫైనల్ జరుగనుంది. మ్యాచ్‌లన్నీ దంబుల్లా వేదికగానే జరుగుతాయి.
భారత్ సూపర్ ఫామ్:
స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సూపర్ ఫామ్‌లో ఉండగా షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌తో కూడిన బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమ్ఇండియాకు రేణుకా సింగ్, పూజా వస్త్రకార్, అరుంధతిరెడ్డి రూపంలో పటిష్టమైన పేస్ బలగం ఉంది. రాధా యాదవ్, దీప్తిశర్మ, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు కలిగిన భారత్ మరోసారి టైటిల్ నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.