KKR vs PBKS | కోల్‌కతా: ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ వర్షార్పణమైంది. శనివారం ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కల్గించాడు. ఎడతెరిపిలేని వర్షానికి తోడు బలలమైన ఈదురుగాలులతో మ్యాచ్‌ను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 201/4 స్కోరు చేసింది.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌సింగ్(49 బంతుల్లో 83, 6ఫోర్లు, 6సిక్స్‌లు), ప్రియాంశ్ ఆర్య(35 బంతుల్లో 69, 8ఫోర్లు, 4సిక్స్‌లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. లీగ్‌లో తమ సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ ప్రియాంశ్, ప్రభ్‌సిమ్రన్..కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వైభవ్ ఆరోరా(2/34) రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతాకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. తొలి ఓవర్ ముగియగానే అందుకున్న వర్షం మ్యాచ్‌ను విడిచిపెట్టలేదు. యాన్సెన్ వేసిన తొలి ఓవర్లో కోల్‌కతా ఏడు పరుగులు చేయగా, గుర్బాజ్(1), నరైన్(4) నాటౌట్‌గా నిలిచారు. ఎంతసేపటికి వాన తెరిపినియ్యకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్..పంజాబ్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ తొలి, చివరి బంతులను బౌండరీలుగా బాదిన ప్రియాంశ్ తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఓ ఎండ్‌లో ప్రియాంశ్..ఎదురైన బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో చెలరేగుతుంటే మరో ఎండ్‌లో ప్రభ్‌సిమ్రన్ ఒకింత ఆలస్యంగా పోటీలోకి వచ్చాడు. సకారియా 4వ ఓవర్లో భారీ సిక్స్‌తో ప్రభ్‌సిమ్రన్ బ్యాటు ఝులిపించగా, ఇద్దరు పోటీపడీ బౌండరీలు బాదారు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 56 పరుగులు చేసింది. వీరి దూకుడుకు కళ్లెం వేసేందుకు కోల్‌కతా కెప్టెన్ రహానే బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది.
ఈ తరుణంలో హర్షిత్ రానా 10వ ఓవర్లో వరుసగా 4, 6, 4 బాదిన ప్రియాంశ్ 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఈసారి తనవంతు అన్నట్లు ప్రభ్‌సిమ్రన్ కూడా జతకలువడంతో పంజాబ్ స్కోరు ఊపందుకుంది. బౌలింగ్ మార్పుగా వచ్చిన రస్సెల్‌ను సిక్స్ బాదిన ప్రియాంశ్ ఆ మరుసటి బంతికే ఆరోరాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 120 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆర్య నిష్క్రమించిన తర్వాత ప్రభ్‌సిమ్రన్ గేర్ మార్చాడు.
సకారియా 13వ ఓవర్లో 4, 4, 6 బాదిన సింగ్..వరుణ్‌ను 4, 4, 6,4తో అరుసుకున్నాడు. అయితే అరోరా వేసిన మరుసటి ఓవర్లోనే రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ చివరి 17 బంతుల్లో 49 పరుగులు కొల్లగొట్టాడు. ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్(7), యాన్సెన్(3) వెంటవెంటనే ఔటయ్యారు. ఇదే అదనుగా ఒత్తిడి పెంచిన కోల్‌కతా ఆఖరి ఐదు ఓవర్లలో రెండు వికెట్లు తీసి 40 పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఈ కారణంగా భారీ స్కోరు చేద్దామనుకున్న పంజాబ్‌ను కోల్‌కతా సమర్థంగా నిలువరించింది.