న్యూఢిల్లీ: దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్‌కు దూరమైంది. సెలెక్షన్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన 48 కేజీల సెమీఫైనల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ గాయపడింది. హర్యానా బాక్సర్ నీతుతో జరిగిన పోరులో మేరీ మేకాలి గాయంతో అర్ధాంతరంగా వెనుదిరిగింది. 2018 గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మేరీ స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి మరోసారి పసిడి వెలుగులు విరజిమ్మాలనుకున్న మేరీకి నిరాశ ఎదురైంది. ‘
కామన్వెల్త్ క్రీడల కోసం చాలా కష్టపడ్డా. దురదృష్టవశాత్తు గాయం బారిన పడ్డా. గతంలో నాకెప్పుడూ మోకాలి గాయం కాలేదు’ అని మేరీ పేర్కొంది. తొలి రౌండ్లో నీతుపై పంచ్ విసిరేందుకు ప్రయత్నించిన 39 ఏండ్ల మేరీ రింగ్‌లోనే ఇబ్బంది పడింది. అయినా మొక్కవోని దీక్షతో మ్యాచ్ కొనసాగించాలనే ప్రయత్నంలో ఆమె కాలు మెలికపడింది. దీంతో నొప్పితో విలవిల్లడిన బాక్సింగ్ లెజెండ్ అయిష్టంగానే రింగ్‌ను వీడింది. ‘ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ గాయం కారణంగా సెలెక్షన్ ట్రయల్స్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగింది’ అని భారత బాక్సింగ్ సమాఖ్య ఒక ప్రకటనలో పేర్కొంది.
మళ్లీ ఎప్పుడో!
కెరీర్ చివరి దశలో ఉన్న మేరీ మోకాలి గాయానికి గురవడంతో.. ఇకపై ఆమె రింగ్‌లో అడుగుపెట్టే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపిక చేసుకున్న పోటీల్లో మాత్రమే పాల్గొంటున్న మేరీకోమ్.. కామన్వెల్త్ క్రీడలకు కూడా దూరం కావడంతో ఇక ఆమె తిరిగి గ్లౌజ్‌లు ఎప్పుడు తొడుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ‘కామన్వెల్త్ కోసం మేరీ తీవ్రంగా శ్రమించింది. అలాంటి సమయంలో గాయం బారిన పడటం నిజంగా దురదృష్టకరం’ అని జాతీయ బాక్సింగ్ కోచ్ భాస్కర్ భట్ పేర్కొన్నాడు. మేరీ సెలెక్షన్ ట్రయల్స్ నుంచి తప్పుకోవడంతో ఈ విభాగంలో నీతు కామన్వెల్త్ క్రీడల్లో చోటు దక్కించుకుది.
అడుగు దూరంలో నిఖత్, లవ్లీనా..
ప్రపంచ చాంపియన్, తెలంగాణ యువకెరటం నిఖత్ జరీన్.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల అర్హతకు అడుగు దూరంలో నిలిచింది. 50 కేజీల సెమీఫైనల్లో నిఖత్ 7-0తో అనామికాపై ఏకపక్ష విజయం సాధించి ముందంజ వేసింది. మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (70 కేజీలు) 7-0తో అంకుషిత బోరోపై గెలిచి కామనెల్త్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇప్పటికే భారత పురుషుల బాక్సింగ్ ట్రయల్స్ పూర్తికాగా.. నిఖత్ శనివారం ఫైనల్లో బరిలోకి దిగనుంది.