Martina Navratilova : టెన్నిస్‌లో మాజీ వరల్డ్ నంబర్ 1 అయిన మార్టినా నవ్రతిలోవా క్యాన్సర్ బారిన పడింది. ఆమెకు గొంతు, రొమ్ము క్యాన్సర్లు తొలి దశలో ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ‘రెండు క్యాన్సర్లు ఒకేసారి రావడం అనేది ఆందోళనకరం. అయితే.. వీటిని తగ్గించవచ్చు. ఈ క్యాన్సర్ల నుంచి కోలుకుంటాననే నమ్మకం ఉంది. అయితే.. ఈ క్రమంలో నా ఆరోగ్యం మరింత దెబ్బతినొచ్చు. అయినా కూడా నేను అన్నివిధాలా పోరాడతాను’ అని నవ్రతిలోవా తెలిపింది. అయితే.. ఆమె గతంలో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంది. 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ తొలి దశలో ఉండడంతో నవ్రతిలోవా రేడియో థెరపీతో మహమ్మారిని జయించింది. పోయిన ఏడాది డబ్ల్యూటీఏ ఫైనల్స్ సందర్బంగా లింఫ్ నోడ్స్ వాచినట్టు నవ్రతిలోవా గమనించింది. వెంటనే బయాప్సీ చేయించుకోవాలనుంది. కానీ ఆమె బయాప్సీకి వెళ్లలేదు.
ప్రస్తుతం 66 ఏళ్లున్న ఆమె త్వరలో ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కామెంటేటర్‌గా విధుల్లో చేరాలనుకుంది. కానీ, ఈ లోపే క్యాన్సర్ నిర్ధారణ కావడంతో షాక్‌కు గురైంది. న్యూయార్క్‌లో ఆమె చికిత్స తీసుకోనుంది. ‘మార్టినాకు గొంతు క్యాన్సర్ స్టేజ్ 1లో ఉంది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఈ నెలలోనే ఆమె చికిత్స తీసుకోనుంది. హ్యూమన్ పాపిలోమా రకానికి చెందిన క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్ ఉన్నవాళ్లు తొందరగా కోలుకుంటారు’ అని టెన్నిస్ ఛానెల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మహిళల టెన్నిస్‌లో నవ్రతిలోవా తిరుగులేని విజయాలు సాధించింది. ఆమె కెరీర్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గింది. వింబుల్డన్ ట్రోఫీని అత్యధికంగా 9 సార్లు అందుకుంది.