పారిస్ ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న యువ షూటర్ మను భాకర్ మరోసారి పతకం దిశగా కీలక ముందడుగు వేసింది. ఈ ఎడిషన్‌లో ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్‌లో కాంస్యాలు సాధించి చరిత్ర సృష్టించిన ఈ హర్యానా అమ్మాయి.. శుక్రవారం జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లో రెండో స్థానంతో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగే ఫైనల్లోనూ గెలిస్తే వ్యక్తిగతంగా మూడో పతకం సాధించిన అథ్లెట్‌గా భారత ఒలింపిక్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంటుంది. ఇదే ఈవెంట్లో పోటీపడ్డ హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్ మాత్రం నిరాశపరిచింది.
Manu Bhakar | పారిస్: టోక్యో ఒలింపిక్స్‌లో ఎదురైన వైఫల్యాలకు పారిస్‌లో పతకాలతోనే దిమ్మతిరిగే సమాధానాలు చెబుతున్న యువ సంచలనం మను భాకర్ వరుసగా మూడో పతకంపై కన్నేసింది. తాజా ఎడిషన్‌లో ఇది వరకే రెండు కాంస్యాలు పట్టుకొచ్చిన మను.. శుక్రవారం ముగిసిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్లో 590 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంతో ముగించి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. రెండు (ప్రిసీషన్, ర్యాపిడ్) భాగాలుగా జరిగే అర్హత రౌండ్లో మను తుపాకీ మరోసారి గురి తప్పకుండా లక్ష్యం వైపునకు దూసుకెళ్లింది. ప్రిసీషన్ మూడు సిరీస్‌లలో 97, 98, 99 పాయింట్లు స్కోరు చేసిన మను.. ర్యాపిడ్‌లో 100, 98, 98తో అర్హత రౌండ్‌ను రెండో స్థానంతో ముగించింది. హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ 581 పాయింట్లు స్కోరుతో తీవ్ర నిరాశపరిచింది.
ప్రిసీషన్ రౌండ్‌ను మను నెమ్మదిగానే మొదలుపెట్టింది. తొలి సిరీస్‌లో రెండు సార్లు మాత్రమే 10 పాయింట్లు సాధించిన ఆమె రెండో సిరీస్‌లో మాత్రం 4 సార్లు పది స్కోరు చేసింది. 3వ సిరీస్‌లో ఐదింటికి ఐదు షాట్లకు 10 పాయింట్లు వచ్చాయి. ఇక ర్యాపిడ్లోనూ ఇదే జోరును కొనసాగించింది. ర్యాపిడ్ మూడు సిరీస్‌లలో రెండు సార్లు 9 స్కోరు చేయగా ఒక్కసారి మాత్రమే 8 పాయింట్లు రాగా మిగిలిన ప్రతి షాట్‌కు 10/10 వచ్చా యి. హంగేరి షూటర్ వెరొనిక 592 స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. 8 మంది పోటీ పడే ఫైనల్లో మను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే హ్యాట్రిక్ మెడల్ పెద్ద కష్టమేమీ కాదు. ఇప్పటి వరకు భారత్ తరఫున సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో మూడు పతకాలు గెలిచిన ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం.