ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు త్రుటిలో పతకం చేజారింది. ఇప్పటికే రెండు కాంస్య పతకాలతో కొత్త చరిత్ర లిఖించిన యువ షూటర్ మను భాకర్‌కు మూడో పతకం ముచ్చటగానే మిగిలింది. మహిళల 25మీటర్ల పిస్టల్ ఫైనల్ ఈవెంట్లో బరిలోకి దిగిన భాకర్ తృటిలో పతక అవకాశాన్ని చేజార్చుకుంది. పాయింట్ల తేడాతో హంగరీ షూటర్‌కు కాంస్య పతకాన్ని వదులుకుంది. విశ్వక్రీడల్లో తన అద్భుత ప్రదర్శనతో దేశ కీర్తి, ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన మను పిస్టల్ పోరులో తుదికంటా పోరాడింది. పతక వేటలో రెండు షాట్ల వైఫల్యంతో మూడో మెడల్ ఖాతాలో వేసుకోలేక నాలుగో స్థానంతో నిరాశపరిచింది. మొత్తంగా టోక్యో ఒలింపిక్స్ పేలవ ప్రదర్శనను మదిలో నుంచి చెరిపేస్తూ భారత షూటింగ్లో మను కొత్త చరిత్రకు నాంది పలికింది.
పారిస్: పారిస్ విశ్వక్రీడల్లో భారత్‌కు త్రుటిలో పతకం చేజారింది. యువ షూటర్ మను భాకర్‌కు చిక్కినట్లు చిక్కిన పతకం పాయింట్ల తేడాతో మరొకరి వశం అయ్యింది. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మహిళల 25మీటర్ల వ్యక్తిగత పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో మను భాకర్ వెంట్రుకవాసిలో మూడో పతకాన్ని దక్కించుకునే అవకాశాన్ని కోల్పోయింది. ఆఖరి షాట్ వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరులో జేఐ యంగ్(కొరియా)-37, జెద్రెవ్స్కీ(ఫ్రాన్స్)-37, వెరొనికా మేజర్(హంగరీ)-31 వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలుచుకోగా, మను భాకర్ 28 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 10మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు సరభ్జ్యోత్సింగ్తో కలిసి మిక్స్‌డ్‌టీమ్ ఈవెంట్లో కాంస్యాలు సాధించిన మను..మూడో పతకంపై పెట్టిన గురి దురదృష్టం కొద్ది తప్పింది.
‘పొటీల్లో ఒకింత ఒత్తిడికి గురయ్యాను. కానీ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు చాలా వరకు ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. నా వరకైతే ఈ ఒలింపిక్స్ అద్భుతంగా ముగిసింది. వచ్చే ఒలింపిక్స్(లాస్ ఎంజిల్స్)లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను. రెండు పతకాలతో ప్రస్తుతం సంతోషంగా ఉన్నా..నాలుగో స్థానంతో ముగించడం నిరాశగా ఉంది’ – మను భాకర్
స్కీట్ షూటింగ్లో భారత షూటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. మొత్తం 30 మంది పురుషుల స్కీట్ ఈవెంట్లో అనంత్‌జీత్‌సింగ్ నరుక 24వ స్థానంతో ముగించాడు. మహిళల ఈవెంట్లో మహేశ్వరి చౌహాన్ 71 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, రైజా థిల్లాన్ 25వ స్థానంలో ఉంది. ఆదివారం క్వాలిఫికేషన్ రౌండ్లు జరుగుతాయి.
పోటీ సాగిందిలా: మొత్తం ఎనిమిది షూటర్లతో 25 మీటర్ల పిస్టల్ ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. తొలుత అందరికీ సమాన షాట్లు కేటాయించగా, అందులో వచ్చిన పాయింట్ల ఆధారంగా తర్వాత ఎలిమినేషన్ మొదలుపెట్టారు. తొలుత అబ్లెన్(అమెరికా) 5 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో పోటీ నుంచి నిష్క్రమించగా, ఆ తర్వాత త్రిన్హ్(వియత్నాం, 16), రోస్టెమియాన్(ఇరాన్, 19), జావో(చైనా, 23) అనుసరించారు. అయితే మూడో స్థానం కోసం మను భాకర్, హంగరీ షూటర్ వెరోనిక మధ్య పోరు జరిగింది. అప్పటికే 28 పాయింట్లతో సమంగా ఉన్న ఈ ఇద్దరు పోటీని ప్రారంభించారు.
ఐదేసి షాట్లతో ఎనిమిది సిరీస్‌లు ముగిసే వరకు చెక్కుచెదరని గురితో ఆకట్టుకున్న భాకర్ ఒకింత తడబాటుకు గురై రెండు సార్లు సరైన షాట్లు సంధించలేకపోయింది. మరోవైపు ఏ మాత్రం ఒత్తిడికి గురికాని వెరోనిక కచ్చితమైన షాట్లతో గురిచూసి కొట్టి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోగా, భాకర్ ఒకింత భారంగా నిష్క్రమించింది. ఒక దశలో ఆరో స్థానానికి పడిపోయిన మను..అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చింది. పోటీల మొదట్లో గురి పెట్టడంలో కీలక పాయింట్లు చేజార్చుకున్న భాకర్..రౌండ్ రౌండ్‌కు తన ప్రదర్శనను మెరుగుపర్చుకుంది. ఈ క్రమంలో గత ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంతో పతకాలు చేజార్చుకున్న జాయ్దీప్ కర్మాకర్(2012), అభినవ్‌బింద్రా(2016), అర్జున్ బబుతా(2024) సరసన మను భాకర్ నిలిచింది.