Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి(West Bengal Sports Minister) మనోజ్ తివారీ(Manoj Tiwary) రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(Cricket Association Of Bengal) పెద్దల అభ్యర్థన మేరకు అతను ఐదు రోజుల్లోనే మనసు మర్చుకున్నాడు. అతను మళ్లీ రంజీ ట్రోఫీ (Ranji Trophy)ల్లో బెంగాల్ తరఫున ఆడనున్నాడు. గురువారం (ఆగస్టు 3) ఇన్స్టాగ్రామ్ వేదికగా తివారీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రంజీల్లో గొప్ప రికార్డు ఉన్న తివారీ పది వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 98 రన్స్ కొడితే అతను 10 వేల క్లబ్లో చేరతాడు. ఇప్పటివరకూ ఈ కుడి చేతివాటం బ్యాటర్ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 29 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు.
మనోజ్ తివారీకి దేశవాళీ క్రికెట్(Domestic Cricket)లో తిరుగులేని రికార్డు ఉంది. 208-19లో విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో 366 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు అతను ఈమధ్యే రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అద్భుతంగా రాణించిన అతను జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ తివారీ టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. 2008లో అతను కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు.
మనోజ్ తివారీ
మిడిలార్డర్లో గట్టి పోటీ ఉండడంతో కేవలం 12 వన్డేలు, 3 టీ20ల్లో మాత్రమే అతడికి అవకాశం వచ్చింది. ఆడింది 12 మ్యాచ్‌లే అయినా వన్డేల్లో సెంచరీతో మెరిశాడు. కానీ, ఆ తర్వాత అవకాశాలు దక్కలేదు. దాంతో, ఐపీఎల్‌పై దృష్టి పెట్టిన తివారీ ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(Kings XI Punjab), రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్(Rising Pune Supergiants) ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.