స్టావెంజర్(నార్వే): ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం జరిగిన తొమ్మిదో రౌండ్లో గుకేశ్..చైనాకు చెందిన వీ యిని ఓడించి మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుని కార్ల్సన్(15) తర్వాత 14.5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
శనివారం జరిగే ఆఖరి రౌండ్లో గుకేశ్..అమెరికా జీఎం ఫాబియానో కరువనతో తలపడనుండగా, కార్ల్సన్..అర్జున్ను ఢీకొననున్నాడు. టోర్నీలో విజేతగా నిలిచే వారికి టైటిల్‌తో పాటు 59 లక్షల ప్రైజ్‌మనీ దక్కనుంది. ఒకవేళ ఢిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ గెలిస్తే అతనికిది ఏడో టైటిల్ కానుంది. మరోవైపు కెరీర్లో తొలిసారి నార్వే టైటిల్ దక్కించుకోవాలన్న పట్టుదలతో గుకేశ్ కనిపిస్తున్నాడు. దీంతో ఆఖరి గేమ్ టోర్నీ విజేతను నిర్ణయించనుంది.