162/3. లక్నో నిర్దేశించిన 239 పరుగుల రికార్డు ఛేదనలో 12.5 ఓవర్లకు కోల్‌కతా స్కోరిది. ఆ జట్టు విజయానికి 43 బంతుల్లో 76 పరుగులు కావాలి. ఇన్నింగ్స్‌లో అప్పటిదాకా కోల్‌కతా ఆడిన ఆటను చూస్తే ఇదేమంత పెద్ద లక్ష్యం కాదు. కానీ రహానే నిష్క్రమణ ఆ జట్టును కుదిపేసింది. 23 పరుగుల వ్యవధిలో నైట్‌రైడర్స్ 5 కీలక వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. ఆఖర్లో రింకూ సింగ్ పోరాడినా అతడి పోరాటం కేకేఆర్‌ను గెలుపు తీరాలకు చేర్చలేదు. విజయానికి ఆ జట్టు 4 పరుగుల దూరంలో నిలిచింది.
కోల్‌కతా: ఐపీఎల్లో మరో హైస్కోరింగ్ థ్రిల్లర్ అభిమానులను ఉర్రూతలూగించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఈడెన్‌గార్డెన్ వేదికగా ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లూ హోరాహోరీగా తలపడ్డా లక్నోనే గెలుపు వరించింది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల ఛేదనలో కేకేఆర్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్, 7 ఫోర్లు, 8 సిక్సర్లు), మార్ష్ (48 బంతుల్లో 81, 6 ఫోర్లు, 5 సిక్సర్లు), మార్క్మ్ (28 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారంతో లక్నో.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 238 పరుగుల రికార్డు స్కోరు చేసింది. భారీ ఛేదనలో కేకేఆర్.. 20 ఓవర్లలో 234/7 వద్దే ఆగిపోయింది. కెప్టెన్ అజింక్యా రహానే (35 బంతుల్లో 61, 8 ఫోర్లు, 2 సిక్సర్లు),వెంకటేశ్ అయ్యర్ (29 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు ఆఖర్లో రింకూ సింగ్ (15 బంతుల్లో 38 నాటౌట్, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు పరాభవం తప్పలేదు.
రైడర్స్.. తగ్గేదేలే!
స్కోరుబోర్డుపై కొండంత లక్ష్యం కనబడుతున్నా కోల్‌కతా వెరవలేదు. లక్నోకు దీటుగా కేకేఆర్ బ్యాటర్లు దంచుడు మంత్రాన్ని జపించారు. డికాక్ (15), నరైన్ (13 బంతుల్లో 30, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 2.3 ఓవర్లలోనే 37 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. డికాక్‌ను ఆకాశ్ దీప్ మూడో ఓవర్లో వికెట్ల ముందు బలిగొన్నాడు. కానీ రహానే, నరైన్ లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పవర్ ప్లేలోనే ఆ జట్టు ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేసి లక్ష్యం వైపు దూసుకెళ్లింది. దిగ్వేశ్.. 7వ ఓవర్లో రెండో బంతికే నరైన్‌ను ఔట్ చేసి లక్నోకు బ్రేక్ ఇచ్చాడు. వెంకటేశ్‌తో కలిసి రహానే.. లక్ష్యాన్ని కరిగించాడు. ఈ ఇద్దరూ ఓవర్‌కు పదికి తగ్గకుండా పరుగులు రాబట్టారు.
4 ఓవర్ల వ్యవధిలో ఖేల్ ఖతం..
లక్ష్యం దిశగా సాఫీగా సాగుతున్న కోల్‌కతాకు శార్దూల్ 13వ ఓవర్లో షాకివ్వడంతో ఆ జట్టు గతి తప్పింది. ఆ ఓవర్ చివరి బంతికి రహానే.. పూరన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో రమణ్‌దీప్ (1), రఘువంశీ (5)తో పాటు క్రీజులో పాతుకుపోయిన వెంకటేశ్ వికెట్లను కోల్పోయింది. రసెల్ (7) సైతం నిరాశపరిచాడు. 4 ఓవర్లలో 23 పరుగుల వ్యవధిలో ఆ జట్టు 5 కీలక వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 38 పరుగులు అవసరమనగా ఆఖర్లో రింకూ.. 6, 4, 4, 4, 6తో మెరుపులు మెరిపించినా ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
దంచుడే దంచుడు..
లక్నోకు ఓపెనర్లు మార్క్మ్,్ర మార్ష్ కలిసి దంచుడుకు బలమైన ముహూర్తం పెడితే.. పూరన్ ఆ విధ్వంసాన్ని నెక్స్ లెవల్‌కు తీసుకెళ్లాడు. స్పెన్సర్ జాన్సన్ రెండో ఓవర్లో బౌండరీతో మార్క్మ్,్ర సిక్సర్‌తో మార్ష్ బాదుడుకు శ్రీకారం చుట్టారు. అతడే వేసిన 4వ ఓవర్లో ఈ ఇద్దరూ 18 పరుగులు రాబట్టారు. ఈ ద్వయం దూకుడుతో 7 ఓవర్లకే లక్నో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. 11వ ఓవర్లో రాణా.. రెండో బంతికి మార్క్మ్‌న్రు క్లీన్‌బౌల్డ్ చేసి 99 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. మార్క్మ్ ఔట్ అయినా మార్ష్‌కు పూరన్ జతకలవడంతో అగ్నికి ఆజ్యం తోడైనైట్టెంది. హర్షిత్ ఓవర్లోనే ఆఖరి బంతిని బౌండరీకి తరలించి ఈ సీజన్లో నాలుగో హాఫ్ సెంచరీని నమోదుచేసిన మార్ష్.. ఆ తర్వాత మరింత దూకుడు పెంచాడు. మరో ఎండ్‌లో పూరన్ బాదడంతో లక్నో స్కోరు రాకెట్ వేగాన్ని తలపించింది. నరైన్ 15వ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన అతడు.. రసెల్, రాణా బౌలింగ్‌లోనూ బంతిని స్టాండ్స్‌లోకి పంపించి 21 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. రసెల్ 18వ ఓవర్లో పూరన్.. 4, 4, 6, 4, 6తో 24 పరుగులు పిండుకోవడంతో లక్నో భారీ స్కోరు సాధించింది.
సంక్షిప్త స్కోర్లు:
లక్నో: 20 ఓవర్లలో 238/3 (పూరన్ 87 నాటౌట్, మార్ష్ 81, రాణా 2/51, రస్సెల్ 1/32) ; కోల్‌కతా: 20 ఓవర్లలో 234/7 (రహానే 61, వెంకటేశ్ 45, శార్దూల్ 2/52, ఆకాశ్ 2/55)